Bimbisara : We ourselves have created the empire of the Trigarthas: Vashishtha
నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా ‘బింబిసార’. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ఈ మూవీ కాప్షన్. ఈ సినిమాతో వశిష్ఠ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆయన తండ్రి మల్లిడి సత్యానారాయణ రెడ్డి కూడా నిర్మాత. విశేషం ఏమంటే గతంలో వశిష్ఠ హీరోగా గీత రచయిత కులశేఖర్ దర్శకత్వంలో ‘ప్రేమలేఖ రాశా’ మూవీ తెరకెక్కింది. అయితే అది విడుదలకు నోచుకోలేదు. ఆ విషయాన్ని వశిష్ఠ తెలియచేస్తూ, ”నటుడిగా ఈ రంగంలోకి అడుగు పెట్టినా నాకు దర్శకత్వం అంటే ఇష్టం. తొలి చిత్రం విడుదల కాకపోవడంతో, నాకు వచ్చిన, నచ్చిన పని చేసుకోవటం ఉత్తమం అనిపించింది. దాంతో దర్శకత్వ శాఖ వైపు అడుగు లేశాను. ‘బింబిసార’ కథ రాసుకుని కళ్యాణ్ రామ్ ను కలిశాను. ఆయనకు నేను చెప్పిన పాయింట్ ఆయనకు నచ్చింది. రెండు, మూడు రోజుల్లో కలుద్దామని అన్నారు. అప్పుడు నిర్మాత హరి గారికి కథ నెరేట్ చేశాను. ఆయనకు నచ్చింది. తర్వాత సినిమా ఎలా ముందుకెళ్లిందనేది అందరికీ తెలిసిందే” అని అన్నారు.
తొలిసారి డైరెక్ట్ చేసిన సినిమానే ఇంత భారీగా తీయడం గురించి చెబుతూ, ”ఇది నాకు దర్శకుడిగా తొలి చిత్రమే అయినా కథ మీద నాకు నమ్మకం ఉంది. కళ్యాణ్‌రామ్ గారు, హరి గారు కూడా దానినే నమ్మారు. ‘బింబిసార’ వంటి గొప్ప సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చారు. వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవటానికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాను. నాకు టీమ్ కూడా బాగా సపోర్ట్ చేసింది. కెమెరామెన్ ఛోటా కె నాయుడు గారు, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్‌గారు, ఫైట్ మాస్టర్ ఇలా అందరి సపోర్ట్‌తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాం. బింబిసారుడు అనే రాజు 500 సంవత్సరాలకు ముందు ఈ దేశాన్ని పరిపాలించాడు. ఆయనకు సంబంధించిన వివరాలేవీ తెలియదు. కాబట్టి నేను కొత్తగా నేర్చుకుంటూ దాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశాను. ఓ రకంగా చెప్పాలంటే నేను ప్రతిరోజూ టైమ్ ట్రావెల్ చేసినట్లు అనిపించేది. బింబిసారుడుకి సంబంధించి త్రిగర్తల అనే సామ్రాజ్యాన్ని మేమే క్రియేట్ చేశాం. మన దేశాన్ని పాలించిన రాజులు ఎవరున్నారు అని ఆలోచించినప్పుడు బింబిసారుడు గురించి తెలిసింది. ఆ పేరు కూడా స్ట్రైకింగ్‌గా అనిపించింది. ఇది పూర్తిగా కల్పిత కథ” అని చెప్పారు.
‘బింబిసార’ సినిమాకు పలువురు సంగీత దర్శకులు పనిచేశారు. ఆ విశేషాలను వశిష్ఠ తెలియచేస్తూ, ”సినిమా అనుకోగానే కీరవాణి గారినే మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుకున్నాం. అయితే అప్పటికే ఆయన ‘ట్రిపుల్ ఆర్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దాంతో ఆయన్ని అప్రోచ్ కూడా కాలేదు. అప్పటికే చిరంతన్ భట్ గారు ఇదే తరహాలో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ మూవీ చేశారు కాబట్టి ఆయన్ని కలిశాం. కథ చెప్పిన తర్వాత ఆయన కర్మ సాంగ్‌ను ఇచ్చారు. తర్వాత మరో సాంగ్‌నూ ఇచ్చారు. ఈ సినిమాకు ఓ ఫోక్ సాంగ్ కావాల్సి వచ్చింది. కానీ అది రొటీన్ ఫోక్ కాకూడదనిపించి వరికుప్పల యాదగిరికి విషయం చెబితే ఆయనే ట్యూన్ కంపోజ్ చేశారు. తర్వాత టీజర్‌కి సంతోష్ నారాయణ్‌గారు మ్యూజిక్ అందించారు. తర్వాత ఆయన బిజీగా ఉండటంతో కీరవాణిగారిని కలిశాం. ఆయన సినిమా చూసి ఏమంటారోనని కాస్త ఆలోచించాం. కానీ ఆయన సినిమా చూసి వర్క్ చేస్తానని చెప్పారు. అలానే ఈ ప్రాజెక్ట్ లో ఆయన కూడా ఇన్ వాల్వ్ అయ్యారు” అని చెప్పారు.
‘ఇందులో పాత్రలన్నీంటికీ ప్రాధాన్యత ఉంటుందని, అన్నింటినీ ఓ సినిమాలోనే చూపించలేం కాబట్టి రెండు భాగాలు చేయాలని అనుకుంటున్నామని, స్క్రిప్టింగ్ టైమ్‌లోనే ఈ ఆలోచన ఉందని, నిజానికి ఇదో సూపర్ మ్యాన్‌లాంటి క్యారెక్టర్ కాబట్టి 3, 4 భాగాలుగా కూడా చూపించవచ్చ’ని వశిష్ఠ అన్నారు.