Rahman : ‘రామాయణ’ కోసం 12 బడా సినిమాలకు ‘నో’ చెప్పిన ఏఆర్ రెహమాన్

Ar Rahman At Peddi Event

Ar Rahman At Peddi Event

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన కొద్ది రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి రికార్డులు తిరగరాస్తోంది. అయితే ఈ భారీ విజయం వెనుక సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ చేసిన ఓ పెద్ద త్యాగం ఉందన్న విషయం రెహమాన్ స్వయంగా వెల్లడించారు. ఈ ఒక్క సినిమా కోసమే తాను ఏకంగా 10 నుంచి 12 సినిమా అవకాశాలను వదులుకున్నానని, గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) వేదికగా దర్శకుడు భరత్ బాలా తెరకెక్కించిన ‘బనారస్’ చిత్రం ప్రదర్శన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘రామాయణ’ వంటి మహాకావ్యానికి సంగీతం అందించే క్రమంలో తన సమయాన్ని, శక్తిని పూర్తిగా దానికే అంకితం చేయాల్సి వచ్చిందని, ఈ క్రమంలో ఎంతోమంది అగ్ర దర్శకుల సినిమాలను కూడా కాదనుకోవాల్సి వచ్చిందని, అయినా సరే ఆ నిర్ణయం పట్ల తనకు ఎలాంటి బాధ లేదని, పైగా గర్వంగా ఉందని స్పష్టం చేశారు.

హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్‌తో కలిసి రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు, ఈ ప్రాజెక్ట్ సంగీత పనుల కోసమే గత మూడేళ్లుగా నిర్విరామంగా శ్రమించినట్లు ఆయన తెలిపారు. సినిమాలోని ప్రతి పాత్రకు తగినట్లుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిద్ధం చేయడానికి చాలా సమయం పట్టిందన్న రెహమాన్ ముఖ్యంగా యష్ పాత్రకు సంబంధించిన ‘రావణ తాండవం’ బీజీఎంను ఫైనల్ చేయడానికి ముందే 12 నుంచి 13 వేర్వేరు వెర్షన్లలో ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు. చివరకు అందరికీ నచ్చేలా అద్భుతమైన అవుట్‌పుట్ రావడంతో తన కష్టానికి తగిన ఫలితం దక్కిందన్న రెహమాన్ సినిమాల ఎంపిక విషయంలో తన ఆలోచనా విధానాన్ని కూడా బయటపెట్టారు. ఏదైనా కథపై తనకు నిజమైన ఆసక్తి, లోతైన కనెక్షన్ ఏర్పడితేనే ఆ సినిమాను ఒప్పుకుంటానని, తాను చేసే పని తనలోని కళాకారుడికి సంతృప్తిని ఇవ్వడంతో పాటు, తనతో కలిసి పనిచేసే బృందంలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపాలని రెహమాన్ అభిప్రాయపడ్డారు. మూడేళ్ల పాటు మరో ఆలోచన లేకుండా ‘రామాయణ’ కోసం రెహమాన్ పెట్టిన ఈ ఎఫర్ట్ ఇప్పుడు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.