ప్రముఖ యాంకర్ శివజ్యోతి తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లి అక్కడ క్యూ లైన్లో నిలబడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. శ్రీవారి ప్రసాదంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, హిందూ సంఘాలు, నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ శివజ్యోతి తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఉన్న సమయంలో, టీటీడీ సేవకులు భక్తులకు అన్నప్రసాదం (సాంబార్ రైస్, పెరుగు అన్నం) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాదం అందుకున్న శివజ్యోతి, ఆమె స్నేహితుడు సంభాషించుకుంటూ…* “తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.”, “తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే.” అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఈ సంభాషణను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో(వీలాగ్) అది క్షణాల్లో వైరల్ అయింది. సరదాగా చేసినప్పటికీ, ఈ వ్యాఖ్యలు పవిత్రమైన ప్రసాదాన్ని, తిరుమల క్షేత్ర పవిత్రతను అపహాస్యం చేసేలా ఉన్నాయని భక్తులు మండిపడుతున్నారు.
Also Read :Venkatesh: త్రివిక్రమ్ మూవీ వాయిదా?
శ్రీవారి ప్రసాదాన్ని భక్తులు భగవంతుని అనుగ్రహంగా భావిస్తారు. ఉచితంగా, భక్తితో ఇచ్చే ప్రసాదాన్ని “అడుక్కుని” తీసుకుంటున్నామని, “బిచ్చగాళ్లం” అని వ్యంగ్యంగా నవ్వుతూ వ్యాఖ్యానించడంపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుడి సన్నిధిలో పేద, ధనిక భేదం లేకుండా అందరూ సమానమేనని, ప్రసాదాన్ని స్వీకరించే పద్ధతిని అపహాస్యం చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో రీల్స్, వీడియోలపై టీటీడీ ఇప్పటికే నిషేధం విధించినప్పటికీ, శివజ్యోతి నిబంధనలు ఉల్లంఘించారని పలువురు ఆరోపిస్తున్నారు.
Also Read :Allari Naresh: అల్లరి నరేష్ పరిస్థితేంటి.. ‘ఆల్కహాల్’ అయినా మత్తు ఎక్కించేనా?
పవిత్రమైన అన్నప్రసాదంపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో స్వామివారిని ఎంతో భక్తితో పూజించి, వ్రతాలు చేసి బిడ్డ కోసం మొక్కుకున్న శివజ్యోతి, ఇప్పుడు ప్రసాదంపై ఇలా మాట్లాడటం షాకింగ్‌కు గురిచేసిందని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, మతపరమైన ప్రదేశాలలో మరింత విచక్షణతో ఉండాలని భక్తులు కోరుతున్నారు. ఈ వివాదంపై శివజ్యోతి లేదా టీటీడీ అధికారులు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఆమె తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతారేమో చూడాలి.