ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అనేక కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. జూన్ 12 మధ్యాహ్నం లండన్ బయలుదేరి ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 270 మంది మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అయితే తాజాగా ఈ దుర్ఘటన జరిగిన నాటి నుంచి మ్యూజిక్ ఆల్బమ్స్ దర్శకుడు మహేశ్ జీరావాలా కూడా కనిపించకపోవడం, అతని కుటుంబాన్ని భయాందోళనకు గురిచేస్తోంది.
Also Read : Disha Patani : ప్రతి ఒక్క ఓటమిని స్వీకరిస్తా..
‘ప్రమాదం జరిగిన రోజు మహేశ్ అహ్మదాబాద్‌లో నిలా గార్డెన్లో ఒకరిని కలవడానికి వెళ్లారు. నాకు గురువారం మధ్యాహ్నం 1 గంటలకు ఫోన్ చేశాడు. మీటింగ్ అయిపోయింది ఇంటికి బయల్దేరుతున్న ట్లు చెప్పాడు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ వచ్చింది’ అని అతని భార్య హేతల్ తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రమాదం జరిగిన ప్రదేశానికి 700 మీటర్ల దూరంలోనే మహేశ్ జీరావాలా ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ ప్రమాదంలో మహేశ్ కూడా చనిపోయారేమోనని గుర్తించడానికి పోలీసులు అతని కుటుంబం నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించారు. ‘మహేశ్ ఎప్పుడూ ఆ మార్గంలో ఇంటికి రాడు. దురదృష్టవశాత్తూ ఆరోజు ఆ మార్గాన్ని ఎంచుకున్నారేమో’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది హేతల్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.