‘ఖిలాడీ’, ‘రామబాణం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ డింపుల్ హయతి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులను జీతం ఇవ్వకుండా ఉన్నపళంగా బయటకు గెంటేశారని ఆమెపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. డింపుల్ హయతి ఇంట్లో ఒడిస్సాకు చెందిన ఇద్దరు యువకులు కొంతకాలంగా పనిచేస్తున్నారు. అయితే, వారికి చెప్పాపెట్టకుండా, ఇవ్వాల్సిన జీతం డబ్బులు కూడా ఇవ్వకుండా వారిని హఠాత్తుగా పనిలోంచి తీసేసి బయటకు పంపించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ, బాధితులు ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ముందు ఇతర ఒడిస్సా కార్మికులతో కలిసి ఆందోళనకు దిగారు.
Also Read :Vayyari Vayyari : ఆకట్టుకుంటోన్న ‘ప్రీ వెడ్డింగ్ షో’ ‘వయ్యారి వయ్యారి’ లిరికల్ వీడియో
తమకు రావలసిన డబ్బుల గురించి అడిగితే, డింపుల్ హయతి తమను బెదిరించారని కార్మికులు వాపోతున్నారు. “నా భర్త లాయర్, మీ సంగతి చూస్తా” అంటూ ఆమె హెచ్చరించినట్లు బాధితులు ఆరోపించారు. అయితే, ఆమెకు అసలు పెళ్లి అయిందా లేదా అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో, ఈ బెదిరింపులు మరింత చర్చనీయాంశంగా మారాయి. డింపుల్ హయతి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో హైదరాబాద్‌లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో పార్కింగ్ విషయంలో గొడవపడి ఆమె వార్తల్లో నిలిచారు. ఆ కేసు ఇంకా నడుస్తుండగానే, ఇప్పుడు ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు కంటే ఇలాంటి వివాదాలతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. ఈ తాజా ఘటనతో ఆమె కెరీర్‌పై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.