AA23: సౌత్ ఇండియన్ సినిమాలో ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ ఒకటి. బన్నీ కెరీర్లో 23వ సినిమాగా తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉందని తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ తెరపైకి వచ్చింది.
గతంలో లోకేశ్ కనగరాజ్‌తో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేసిన యంగ్ రైటర్, డైరెక్టర్ రత్నకుమార్ మరోసారి ఆయనతో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రత్నకుమార్ సోషల్ మీడియాలో ‘కొత్త ఆరంభం’ అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు మరోసారి రత్నకుమార్, లోకేశ్ కనగరాజ్ కలిసి పనిచేయనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెంచాయి. ఈ క్రేజీ కాంబినేషన్ అల్లు అర్జున్ సినిమా కోసమేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇకపోతే రత్నకుమార్ ఈ ఏడాది ’29’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలు అందుకున్నారు. ఇక తనదైన స్క్రీన్‌ప్లే, కథనంతో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్, ఇప్పుడు బన్నీతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే క్యూరియాసిటీ గట్టిగా ఉంది.

