Chup Trailer: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, శ్రేయ ధన్వంతరి జంటగా సన్నీ డియోల్, పూజ భట్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘చుప్.. రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్’. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆర్. బాల్కి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి ఇది క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక సైకో కిల్లర్.. రివ్యూఇచ్చేవారిని చంపేస్తూ ఉంటాడు. సినిమాకు వారు ఇచ్చిన రేటింగ్ ను బట్టి వారిని చంపి వారి తలమీద అన్నే రేటింగ్స్ ఇస్తూ ఉంటాడు. ఒక సినిమాకు ఒక స్టార్ మాత్రమే ఇచ్చిన క్రిటిక్ తలపై ఒక స్టార్ ముద్ర వేస్తాడు. అలా ఎన్ని స్టార్లు ఇస్తే అన్ని ముద్రలు వేస్తూ ఉంటాడు. ఇక ఈ సైకో కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీస్ సన్నీ డియోల్ రంగంలోకి దిగుతాడు.
ఇక మరోపక్క దుల్కర్, తన ప్రేయసి శ్రేయా ఇద్దరు సినిమాల గురించి మాట్లాడుకుంటూ కనిపించారు. ఇక పూజా భట్ సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ గా కనిపించింది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు..? ఎందుకు క్రిటిక్స్ ను చంపుతున్నాడు..? సైకో కిల్లర్ కు దుల్కర్ కు సంబంధం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ చాలా గ్రిప్పింగ్ గా కట్ చేశాడు డైరెక్టర్. సినిమా మొత్తం సినిమాల చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. ఫేక్ రివ్యూస్ రాయడం వలన జీవితాన్ని పోగొట్టుకున్న ఒక వ్యక్తి వారిపై పగ ఎలా తీర్చుకున్నాడు అనేది కథగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా దుల్కర్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.