ఈ యేడాది దసరా సీజన్ రంజుగా ఉండబోతోంది. దానికి కారణం ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఆ సీజన్ లో బాక్సాఫీస్ బరిలోకి దిగడమే! అందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు కింగ్ అక్కినేని నాగార్జున. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి, నయనతార కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల చిరంజీవి లుక్ ను విడుదల చేసిన సందర్భంలో ‘గాడ్ ఫాదర్’ను దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. పర్టిక్యులర్ గా ఏ తేదీ అనేది చెప్పకపోయినా దసరా సీజన్ లో తమ చిత్రం వస్తుందని ప్రకటించారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ కూడా అదే సీజన్ లో అక్టోబర్ 5న రాబోతోంది.
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ మూవీని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ హై – ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాగార్జున తొలిసారి ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ తార గుల్ పనాగ్ కీలక పాత్ర పోషించారు. శనివారం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఆ సందర్భంగా అక్టోబర్ 5న, దసరా కానుకగా తమ చిత్రం జనం ముందుకు వస్తుందని మేకర్స్ తెలిపారు.
విశేషం ఏమంటే ఇటు చిరంజీవికి, అటు నాగార్జునకు కూడా ఈ రెండు సినిమాలు చాలా కీలకం. చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదలై పరాజయం పాలైంది. అలానే నాగార్జున నటించిన ‘బంగర్రాజు’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది కానీ బాక్సాఫీస్ బరిలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తరహాలో సందడి చేయలేకపోయింది. దాంతో ఈ యేడాది వస్తున్న తమ రెండో సినిమాపై వీరిద్దరూ భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి దసరా కానుకగా రాబోతున్న ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’ చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.