Chiranjeevi vs Balayya: యన్టీఆర్, ఏయన్నార్ తరువాత తెలుగు చిత్రసీమలో సమవుజ్జీలు అనిపించుకున్న స్టార్స్ ఎవరంటే చిరంజీవి, బాలకృష్ణ అనే చెప్పాలి. వారిద్దరి బాక్సాఫీస్ వార్ సైతం ప్రేక్షకులకు ముచ్చటగొలిపేది. చిరు, బాలయ్య మధ్య దాదాపు 24 సార్లు బాక్సాఫీస్ వార్ సాగింది. ఇప్పుడు 25వ సారి వారిద్దరూ బాక్సాఫీస్ బరిలో ఢీ కొంటున్నారు. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’తో సంక్రాంతి సందడి చేయనుండగా, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో అదే సీజన్ సంబరాల్లో పాల్గొనబోతున్నారు. దాంతో ఇరువురి అభిమానుల మదిలో పాత జ్ఞాపకాలు దొర్లుతున్నాయి.
చిరంజీవి, బాలకృష్ణ ఇప్పటికి 24 సార్లు బాక్సాఫీస్ బరిలో పోటీపడ్డా, సంక్రాంతి సంబరాల్లోనే వారిద్దరి చిత్రాలు ఎక్కువగా ఢీ కొనడం విశేషం. అలా పొంగల్ బరిలో వారిద్దరూ ఎనిమిది సార్లు పోటీపడ్డారు. ఇప్పుడు తొమ్మిదోసారి పోటీకి సై అంటున్నారు. వారిద్దరి పొంగల్ హంగామా చూస్తే, తొలిసారి 1987లో చిరంజీవి ‘దొంగమొగుడు’తోనూ, బాలకృష్ణ ‘భార్గవరాముడు’తోనూ ఢీ కొన్నారు. ఈ రెండు సినిమాలు ఒక్కో ఏరియాలో ఒక్కోలా ప్రదర్శితమయ్యాయి. తరువాతి సంవత్సరం చిరంజీవి ‘మంచిదొంగ’తో వస్తే, బాలయ్య ‘ఇన్ స్పెక్టర్ ప్రతాప్’గా రంగంలోకి దూకారు. ఇక్కడా అంతే, ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరిది పైచేయిగా సాగింది. 1997లో చిరంజీవి ‘హిట్లర్’గా వస్తే, బాలకృష్ణ ‘పెద్దన్నయ్య’గా వచ్చారు. రెండూ ఘనవిజయం సాధించాయి. చిరంజీవి ‘హిట్లర్’ ఎక్కువ కేంద్రాలలో శతదినోత్సవం చూడగా, బాలకృష్ణ ‘పెద్దన్నయ్య’ ఆ యేడాది సంక్రాంతి బరిలో అత్యధిక వసూళ్ళు చూసిన చిత్రంగా నిలచింది. 1999లో చిరంజీవి ‘స్నేహం కోసం’తో రాగా, బాలయ్య ‘ సమరసింహారెడ్డి’గా సందడి చేశారు. అప్పుడు బాలయ్యది పైచేయిగా సాగింది.
2000లో చిరంజీవి ‘అన్నయ్య’గా అలరిస్తే, బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’గా వచ్చారు. ‘అన్నయ్య’దే పైచేయి అనిపించుకుంది. 2001లో బాలకృష్ణ ‘నరసింహనాయుడు’ ముందు చిరంజీవి ‘మృగరాజు’ నిలవలేక పోయింది. 2004లో బాలకృష్ణ ‘లక్ష్మీనరసింహా’ జయకేతనం ఎగురవేయగా, చిరంజీవి’ అంజి’ పరవాలేదనిపించింది.మళ్ళీ వీరిద్దరూ 2017లో సంక్రాంతి బరిలో ఢీ కొన్నారు. అప్పుడు బాలకృష్ణ తన వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో వస్తే, చిరంజీవి తన 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’తో బరిలోకి దూకారు. బాలయ్యది హిస్టారికల్ మూవీ కాగా, చిరంజీవి సోషల్ మూవీ. ఇద్దరూ విజయం సాధించారు. కొన్ని ఏరియాల్లో చిరంజీవిదే పైచేయిగా సాగింది. ఇలా లెక్కలు చూడగా, పొంగల్ హంగామాలో బాలయ్యదే పైచేయిగా కనిపిస్తోంది. దాంతో బాలయ్య ఫ్యాన్స్ ‘వీరసింహారెడ్డి’పై ఆశలు పెంచుకున్నారు. అయితే ‘వాల్తేరు వీరయ్య’గా చిరంజీవి కూడా అలరిస్తారని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయం. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయో చూడాలి.