Charmy Kaur Reacts On Liger Exhibitors Dharna Via Email: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ వంటి సెన్సేషనల్ కాంబోలో రూపొందిన ‘లైగర్’ సినిమా.. భారీ వసూళ్లతో రికార్డుల పర్వం సృష్టిస్తుందని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా అది బోల్తా కొట్టేసింది. గతేడాది తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం.. అతిపెద్ద డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కారణంగా డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఎగ్జిబిటర్లు చాలా నష్టాలు చవిచూశారు. ఆ సమయంలో ఈ సినిమాపై ఎన్నో విమర్శలు రావడంతో పాటు, మరెన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గానూ నిలిచింది. కొన్ని రోజుల పాటు ఈ సినిమా చర్చలే అంతటా నడిచాయి. క్రమంగా ఈ లైగర్ వివాదం సద్దుమణుగుతూ వచ్చింది.
Congress: గత రికార్డులను తుడిచిపెట్టిన కాంగ్రెస్.. 1989 తర్వాత భారీగా ఓట్లు, సీట్లు..
అయితే.. ఇప్పుడు నైజాం ఏరియాకు చెందిన ఎగ్జిబిటర్లు, ఈ సినిమా వల్ల ఎంతో నష్టపోయామంటూ హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ఎదుట నిరవధిక దీక్షకు పూనుకున్ననారు. నష్టాలను భర్తీ చేస్తామని పూరీ జగన్నాథ్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ధర్నాపై నటి, లైగర్ నిర్మాత చార్మీ కౌర్ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో ఎగ్జిబిటర్లకు అనుకూలంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఫిలిం ఛాంబర్‌కు ఈ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపినట్లు తెలిసింది. అయితే.. పూరీ జగన్నాథ్ ఈ వ్యవహారంపై ఇంకా స్పందించాల్సి ఉంది. విజయ్ దేవరకొండ కూడా ఈ వివాదంపై ఎలా రియాక్ట్ అవుతాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.