Captain : తమిళనాట సీనియర్ స్టార్ హీరో విజయకాంత్ కు లక్షలాది మంది అభిమానులున్నారు. విలన్ పాత్రలతో కెరీర్ ప్రారంభించి, ఆపైన హీరోగా ఎదిగాడు విజయకాంత్. 1979లో నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత మాస్ హీరోగా స్థిరపడ్డారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే సొంతంగా ‘డిఎండికె’ పార్టీని స్థాపించి, 2011 నుండి 16 వరకూ తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాను అనుభవించారు. సమాజంలోని అవినీతి, అక్రమాలపై ధ్వజమెత్తే పౌరుడిగా పలు చిత్రాలలో నటించిన విజయకాంత్… ఇరవైకు పైగా పోలీసు చిత్రాలూ చేశారు. ఆయన వందో చిత్రం ‘కెప్టెన్ ప్రభాకరన్’ ఘన విజయం సాధించడంతో అప్పటి నుండి అభిమానులంతా ‘కెప్టెన్’ అని సంభోదించడం మొదలెట్టారు. కెరీర్ ప్రారంభంలోనే విప్లవనటుడిగా పేరు తెచ్చుకున్నారు విజయకాంత్. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, 2016లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు.
ఏడు పదుల వయసులో మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు విజయకాంత్. దాంతో గత యేడాది ద్వితీయార్ధంలో మూడు కాలివేళ్ళను సర్జరీ చేసి వైద్యులు తొలగించారు. ఇవాళ విజయకాంత్ 33వ వివాహ వార్షికోత్సవం. ఆయన పెళ్ళి 1990 జనవరి 31న ప్రేమలతతో జరిగింది. 33 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని పురస్కరించుకుని, భార్యాభర్తలిద్దరినీ పూలమాలతో సత్కరించిన ఫోటోను ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో ఉన్న విజయకాంత్ ను చూసి, అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. ‘మా కెప్టెన్ ఇలా అయిపోయాడేమిటీ?’ అని వాపోతున్నారు. నిజానికి 70 సంవత్సరాలనేది పెద్ద వయసేమీ కాదు. కానీ సినిమా రంగంలో బిజీగా ఉన్నప్పుడు మూడు షిఫ్టుల్లో విశ్రాంతి లేకుండా విజయకాంత్ గడిపారు. నిర్మాతల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. పలు చిత్రాలు నిర్మించారు, కొన్నింటికి దర్శకత్వం వహించారు. ఆ సమయంలో ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఇవాళ ఇబ్బందులు పడుతున్నారని ఆయన అభిమానులు అంటున్నారు. తమ అభిమాన నటుడు, నాయకుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని వారంతా ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.