Can These Directors Save Bollywood: బాలీవుడ్‌లో పేరున్న స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోతున్నాయి. ఇక దక్షిణాది డబ్బింగ్ సినిమాల వేవ్‌లో హిందీ చిత్రాలు చతికిల పడిపోవడం బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తోంది. దీనికి తోడు మీడియా కూడా సౌత్ సినిమా ముందు వెలవెల బోతున్న బాలీవుడ్ అంటూ ప్రతీవారం ఏదో ఒక కోణంలో కథలు ప్రచురిస్తూనే ఉన్నాయి. అయితే అసలైన దర్శకుల చిత్రాలు ఇంకా జనం ముందుకు రాలేదని, వస్తే మళ్ళీ బాలీవుడ్ వెలిగిపోతుందని అక్కడి విశ్లేషకులు అంటున్నారు. మరి వారిలో అంతగా ఆశలు రేపుతున్న వారెవరో ఓ సారి చూద్దాం.
ఆల్ ఇండియా టాప్ టెన్‌లో నాలుగు సినిమాలు దక్షిణాదివారివే ఉన్నాయి. ఆ నాలుగు కూడా డబ్బింగ్ మూవీస్ కావడం విశేషం. వాటిలో 2వ స్థానంలోని ‘బాహుబలి-2’, 4వ స్థానం ఆక్రమించిన ‘ట్రిపుల్ ఆర్’, 9వ స్థానంలో ఉన్న ‘బాహుబలి-1’ చిత్రాలు తెలుగు దర్శకుడు రాజమౌళి రూపొందించినవి. ఇక మూడో స్థానంలో వెలుగుతున్న ‘కేజీఎఫ్-2’ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కింది. అందువల్ల మిగిలిన స్థానాల్లోని దర్శకులు తప్పకుండా బాలీవుడ్‌ను కాపాడుతారని విశ్లేషకులు ఆశిస్తున్నారు.
బాలీవుడ్ బాబుల లెక్కల ప్రకారం టాప్ టెన్‌లో నంబర్ వన్ స్థానంలో నిలచిన ‘దంగల్’ దర్శకుడు నితీశ్ తివారీ తాజా చిత్రం కోసం వేచి ఉన్నారు. నితీశ్ తివారీ తరువాత ‘బ్రేక్ పాయింట్’ అనే డాక్యుమెంటరీని జీ5 ఓటీటీ కోసం రూపొందించారు. ఆయన దర్శకత్వంలో ఆపై ఏ సినిమా రూపొందలేదు. ప్రస్తుతం ‘బవాల్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు నితీశ్ తివారీ. ఇందులో వరుణ్ ధవన్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది వెలుగు చూడనుంది.
టాప్ టెన్‌లో ఐదో స్థానంలో నిలచిన ‘బజరంగీ భాయిజాన్’ దర్శకుడు కబీర్ ఖాన్ మాత్రం జనాన్ని నిరాశ పరిచారనే చెప్పాలి. ఆ తరువాత ఆయన తెరకెక్కించిన “ఫాంటమ్, ట్యూబ్ లైట్, 83” చిత్రాలేవీ టాప్ టెన్‌లో చోటు సంపాదించలేకపోయాయి. అయినా కబీర్ ఖాన్ ఏదో ఒకరోజున బంపర్ హిట్ కొడతాడని హిందీ జనం ఆశిస్తున్నారు. ఆరో స్థానంలో నిలచిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చిత్ర దర్శకుడు అద్వైత్ చందన్ రూపొందించిన ‘లాల్ సింగ్ చడ్డా’ ఇటీవలే జనం ముందు నిలచి పరాజయాన్ని చవిచూసింది.
టాప్ టెన్ లో ఏడో స్థానం ఆక్రమించిన ‘పీకే’ చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తరువాత తెరకెక్కించిన ‘సంజు’ కూడా వసూళ్ళ వర్షం కురిపించింది. అయితే ‘పీకే’ స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన షారుఖ్ ఖాన్ హీరోగా ‘డన్కీ’ అనే చిత్రం తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. పదో స్థానంలో నిలచిన ‘సుల్తాన్’ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తరువాత తెరకెక్కించిన చిత్రాలలో ‘టైగర్ జిందా హై’ పరవాలేదనిపించింది. అయితే ఆయన రూపొందించిన ‘భారత్, తాండవ్’ అంతగా ఆకట్టుకోలేక పోయాయి. షాహిద్ కపూర్ తో తెరకెక్కిస్తోన్న ‘బ్లడీ డాడీ’ డిసెంబర్ లో విడుదల కానుంది. ఆ సినిమాపై కూడా బాలీవుడ్ జనం ఆశలు పెట్టుకున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన కొన్ని చిత్రాలు ఒకప్పుడు టాప్ టెన్ లో చోటు సంపాదించినవే. ఆయన తెరకెక్కించిన ‘గంగుబాయ్ కతియవాడి’ పరవాలేదు అనిపించుకుంది. మళ్ళీ భన్సాలీ దర్శకత్వంలో ఏ చిత్రం రూపొందనుందో తెలియదు. కానీ, ఈ సారి సంజయ్ తన చిత్రంతో బాలీవుడ్ ను మరింతగా వెలిగిస్తాడని ఆశిస్తున్నారు అక్కడి జనం. రోహిత్ శెట్టికి ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ తరువాత ఆ స్థాయి సక్సెస్ రాలేదు. కానీ, ప్రస్తుతం రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే జోడీగా ఆయన తెరకెక్కిస్తోన్న ‘సర్కస్’పై బాలీవుడ్ బాబులు బాగానే ఆశలు పెంచుకున్నారు.
ఒకప్పుడు తన “మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్” చిత్రాలతో ఆల్ ఇండియాను షేక్ చేసిన సూరజ్ బర్జాత్యాపైనా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రధారిగా, సూరజ్ తెరకెక్కిస్తోన్న ‘ఊంచాయ్’పై కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, అమితాబ్ బచ్చన్ వంటి మాజీ సూపర్ స్టార్ తో ఇప్పట్లో బంపర్ హిట్ కొట్టే అవకాశాలు తక్కువే అని సినీజనం అంటున్నారు. తక్కువ బడ్జెట్ తో మంచి విజయాలను చూపించిన శ్రీరామ్ రాఘవన్ ‘అంధాదున్’ తరువాత తెరకెక్కిస్తోన్న ‘మెర్రీ క్రిస్మస్’ ఈ యేడాదే వెలుగు చూడనుంది. దానిపైనా కొందరికి ఆశలు ఉన్నాయి. ఇందులో కత్రినా కైఫ్, సౌత్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నారు. మరి ఈ సినిమాల్లో ఏ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటి, పరువు నిలుపుతాయో చూడాలి.