Satyadev: వర్సటైల్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ ఇద్దరూ కలిసి ఇప్పుడో సినిమాలో నటిస్తున్నారు. విశేషం ఏమంటే వీరిద్దరికీ ఇది 26వ సినిమా. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో బాల సుందరం, దినేశ్ సుందరం దీనిని నిర్మిస్తున్నారు. ఈ క్రిమినల్ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ కథానాయికగా ప్రియ భవానీ శంకర్ ను ఎంపిక చేశారు. తాజాగా మరో హీరోయిన్ గా బ్రెజిలియన్ మోడల్ జెన్నిఫర్ పిచినెటో ను ఎన్నుకున్నారు. ఇటీవల విడుదలైన అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’తో పాటు తెలుగు వెబ్ సీరిస్ ‘సిన్’లోనూ జెన్నిఫర్ నటించింది. ఇప్పుడీ సినిమాలోకి ఆమెను ఆహ్వానిస్తూ జెన్నిఫర్ అల్ట్రా మోడరన్ లుక్ లో ఉన్న ఓ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. చరణ్ రాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీకి మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రాఫర్. మీరాఖ్ సంభాషణలు సమకూర్చుతున్నారు.