Brahmanandam : సీనియర్ మేకప్ మేన్ బొమ్మదేవర రామచంద్రరావు గతంలో అనుష్క నాయికగా సముద్ర దర్శకత్వంలో ‘పంచాక్షరి’ మూవీని నిర్మించారు. ఇప్పుడు తన కుమారుడు తేజ్ బొమ్మదేవరను హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో ‘మాధవే మధుసూదన’ సినిమాను నిర్మిస్తున్నారు. రిషిక లోక్రే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని సెకండ్ లిరికల్ సాంగ్ ను ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం విడుదల చేశారు.
అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ, “‘మాధవే మధుసూదన’ సినిమాలోని ‘సైయారా.. సైయారా..’ సాంగ్ చూశాను. నేను బాగోక పోతే ఎవ్వరిని పొగడను. బొమ్మదేవర రామచంద్రరావు కుమారుడు తేజ్ బాగా యాక్ట్ చేశాడు. కొత్త వాడైనా చాలా ఈజ్ వుంది. డాన్స్ బాగా చేశాడు. మేకప్ మేన్ చంద్ర నాకు చాలా కాలంగా తెలుసు. కానీ ఇంత బాగా డైరెక్షన్ చేస్తాడని నేను అనుకోలేదు. మంచి అభిరుచి వున్నా చంద్ర, నిర్మాతగా కూడా మంచి విజయం సాధించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. పాట చాలా చాలా బాగుంది. కొరియోగ్రఫీ కూడా బావుంది. కొరియోగ్రాఫర్ రాజు సుందరం మాస్టర్ కి కంగ్రాట్యులేషన్” అని అన్నారు. దర్శక, నిర్మాత బొమ్మదేవర రామచంద్ర రావు మాట్లాడుతూ, “బ్రహ్మానందంగారి చేతుల మీదుగా ఈ పాట విడుదల కావడం ఆనందంగా ఉంది. చాలా కాలంగా నాతో ఆయనకు మంచి అనుబంధం వుంది. ఫోన్ చేసి అడిగిన వెంటనే ఇంటికి రమ్మని నా బిడ్డ తేజ్ ను ఆశీర్వదించిన బ్రహ్మనందం గారికి, ఆయన సతీమణి లక్ష్మి గారికి ఎప్పుడూ రుణపడి వుంటాను. ఈ పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది. మిస్ అవకుండా చూడండి. వికాస్ బాడిస సంగీతం అందించిన ఈ సినిమా పాటను వైష్ణవి కొవ్వూరి పాడారు. మిగిలిన పాటలు త్వరలో విడుదల కాబోతున్నాయి. వాసు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది” అని అన్నారు.