గత కొంతకాలంగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘థాకడ్’ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. చైల్ట్ ట్రాఫిక్ మీద రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఏజెంట్ అగ్నిగా కంగనా రనౌత్ నటించింది. అందులో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాలను చేసింది. కానీ పేలవమైన కథ, కథనాల కారణంగా ‘థాకడ్’కు మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు.
ఈ మధ్య కాలంలో కంగనా రనౌత్ మూవీ ఇంత దారుణంగా పరాజయం పొందడం ఇదే మొదటిసారి. అర్జున్ రామ్ పాల్, దివ్యా దత్త, శాశ్వత ఛటర్జీ, షరీబ్ హష్మీ, సిద్ధాంత్ శుక్లా తదితరులు కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిని జూలై 1న జీ 5లో అందుబాటులో ఉంచబోతున్నారు. నిజానికి ‘థాకడ్’ మూవీని మొదట్లో హిందీతో పాటు దక్షిణాది రాష్ట్రాలలోనూ విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత దర్శక నిర్మాతలు మనసు మార్చుకున్నారు. అదీ ఒకందుకు మంచిదైంది. తెలుగు ప్రేక్షకులు బ్రతికిపోయారు!!