Bhimaa Teaser: మ్యాచో హీరో గోపీచంద్ గత కొంతకాలంగా హిట్స్ లేకుండా సతమతమవుతున్న విషయం తెల్సిందే. గతేడాది రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీచంద్ కు హిట్ సినిమాలను అందించిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వీరి కాంబోలో సినిమా అంటే అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపించారు కానీ, కథాకథనాలు తేడా కొట్టడంతో సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం భీమా. హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటిస్తున్నారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సలార్ ఫేమ్ రవిబసూర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా గోపీచంద్ కనిపించబోతున్నాడు. యధా యధా ధర్మస్య శ్లోకం తో బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ చెప్తుండగా.. గుడిని, రౌడీలను, ప్రజలను చూపిస్తూ.. టీజర్ కట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక చివర్లో ఈ రాక్షసులను వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడురా.. అనగానే గోపీచంద్ లుక్ ను చూపించి హైప్ పెంచేశారు. పోలీస్ డ్రెస్ లో ఒక ఎద్దుపై గోపిచంద్ కూర్చోని స్టైల్ గా కనిపించాడు. ఒక్క టీజర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో గోపీచంద్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.