కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో చిత్రపరిశ్రమ కొద్దిగా పుంజుకొంటుంది అనుకొనేలోపు థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో సినిమాలను వాయిదా వెయ్యడం తప్ప వేరే మార్గం కనిపించడంలేదు మేకర్స్ కి. ఇప్పటికే పాన్ ఇండియా ఫిల్మ్స్ ‘ ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ కరోనా కారణంగా వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరిలో ఏమైనా కేసులు తగ్గుతాయి అనుకునేంత పరిస్థితి లేకపోవడంతో ఫిబ్రవరిలో విడుదలయ్యే సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఇటీవలే ఫిబ్రవరిలో విడుదల కానున్న ‘ఆచార్య’ రిలీజ్ డేట్ ని మార్చి ఏప్రిల్ లో వస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పుడు అందరి చూపు ‘భీమ్లా నాయక్’ పైనే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు సార్లు వాయిదా పడింది. ఇక తాజాగా మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. కరోనా కారణంగా అన్ని సినిమాలు వెనకడుగు వేసి కొత్త రిలీజ్ డేట్ ని వెతుక్కొంటున్నాయి. ఇక ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ ని కూడా వాయిదా వెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే వాయిదా విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
ఇకపోతే ఒకవేళ వాయిదా పడితే ఈ సినిమా.. ఏ సినిమాకు పోటీగా రానున్నది అంటే..అన్ని అంచనా వేసుకొని ఏప్రిల్ లోనే ఈ చిత్రాన్ని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఏప్రిల్ లో ‘ఆచార్య’, ‘కెజిఎఫ్’, ‘బీస్ట్’ వరుసలో ఉన్నాయి. వీటితో పాటు ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. ఇకపోతే భీమ్లా నాయక్ వాయిదా చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ మాత్రం సినిమా వాయిదాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా మేకర్స్ మాత్రం సినిమాను సరైన సమయంలోనే రిలీజ్ చేసే ప్లాన్స్ లోనే ఉన్నారట.. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ నోరు విప్పాల్సిందే.