Varun Dhawan: ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూట్ చేసిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ రీసెంట్ గా ‘కాంతార’ చిత్రంతో మరో హిట్ ను అందుకుంది. ఇప్పుడు హారర్, కామెడీ మూవీని ఈ సంస్థ తెలుగువారి ముందుకు తీసుకురాబోతోంది.
శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావుతో 2018లో ‘స్త్రీ’ సినిమాను అమర్ కౌశిక్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మించాడు. ఈ హారర్, కామెడీ మూవీ బాక్సాఫీస్ లో చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2021లో ‘రూహి’ చిత్రాన్ని నిర్మించాడు దినేష్ విజన్. ఇప్పుడు మూడో చిత్రంగా ‘భేడియా’ను అమర్ కౌశిక్ దర్శకత్వంలోనే నిర్మించాడు. హిందీ, తమిళ, తెలుగులో ఈ సినిమాను ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. వరుణ్ థావన్, కృతీసనన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా 2డీతో పాటు త్రీడీలోనూ విడుదల చేయబోతున్నారు. ఇందులో తోడేలు కాటుకు గురైన భాస్కర్ గా వరుణ్ నటిస్తే, డాక్టర్ అనిక పాత్రను కృతీసనన్ పోషించింది. విశేషం ఏమంటే… ఈ సినిమా తెలుగు వర్షన్ ‘తోడేలు’ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తున్నారు. కంటెంట్ ఓరియంటెడ్ మూవీ ‘కాంతార’ ఘన విజయం తర్వాత గీతా ఫిలిమ్ సంస్థ పంపిణీ చేస్తున్న ‘తోడేలు’కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.