Raj Kundra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజ్ కుంద్రా బెయిల్ పై బయట తిరుగుతున్నాడు. మహిళలను బెదిరించి అశ్లీల వీడియోలను తీసి యాప్ లో పోస్ట్ చేసి డబ్బులు గుంజుతున్నాడంటూ అతడిపై ఆరోపణలు వచ్చాయి. అవి ఆరోపణలు కావని, నిజంగానే అతను అదే పని చేస్తున్నాడని ఎంతోమంది తారలు అతడికి విరుద్ధంగా మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఇక ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు విచారణలో తగిన ఆధారాలను దొరకబుచ్చుకొని కోర్టులో సమర్పించారు. కోర్టు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయగా.. ఆయన సుప్రీం కోర్టులో బెయిల్ కు పిటిషన్ పెట్టాడు. ఇక తాజాగా రాజ్ కుంద్రాకు నాలుగు వారాలు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
ఇక ఈ కేసులో తనను కావాలని ఇరికించారని, తనను బలిపశువును చేశారని రాజ్ కుంద్రా ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ఏ ఒక్క మహిళను బెదిరించి, భయపెట్టి వీడియోలు తీయలేదని, వారెవ్వరు తనకు విరుద్ధంగా సాక్ష్యం కూడా చెప్పలేదని చెప్పుకొచ్చాడు. ఇలాంటి అభియోగాలు మోపిన వారెవ్వరు సరైన ఆధారాలను చూపించలేకపోయారని, ఈ కేసులో తాను నిర్దోషిని అని చెప్పుకొచ్చాడు. పోలీసులు ఛార్జ్ షీట్ లో రాసినట్లుగా తన దగ్గర రహస్య కంటెంట్ ఏం లేదని, హాట్ షాట్స్ అనే యాప్ లో వీడియోస్ అప్ లోడ్ చేసింది కూడా తాను కాదని వాదించాడు. ఇక ఈ వాదనలు విన్న కోర్టు.. అతనికి నాలుగు వారాలు బెయిల్ ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఇది రాజ్ కుంద్రాకు ఊరట కలిగించే వార్త అనే చెప్పాలి. మరి ముందు ముందు రాజ్ కుంద్రా ఈ కేసు నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.