Balakrishna Unstoppable Anthem Review: నటసింహ నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ వేదికపై ‘అన్ స్టాపబుల్’ ప్రోగ్రామ్ తో చేసిన రచ్చ వేడి ఇంకా తగ్గనే లేదు. అప్పుడే రెండో సీజన్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘అన్ స్టాపబుల్ ఆంథెమ్’ ను మంగళవారం జనం ముందు నిలిపారు. బాలకృష్ణకు ఉన్న మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొనే ఈ ఆంథెమ్ రూపొందిందని చెప్పవచ్చు. మహతి స్వరసాగర్ బాణీల్లో రోల్ రైడా ర్యాప్ తో ఈ ఆంథెమ్ రూపుదిద్దుకుంది. “ఏదీ నేను దిగనంత వరకే… ఒన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్…” అనే బాలయ్య డైలాగ్ తోనే ఆంథెమ్ మొదలు కావడం విశేషం! “తను ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంటా…” అంటూ ఈ పాట సందడి ఆరంభమవుతుంది.
“మా బాలయ్య ఫ్యాన్ బేస్ కు ఎవరూ సాటి లేరంటా…” అని యన్బీకే ఫ్యాన్స్ ను ఉత్సాహ పరచిన వైనమూ ఇందులో కనిపిస్తుంది. “ఫ్లూటు జింకముందు ఊదు… సింహం ముందు కానే కాదు…” అంటూ బాలయ్య డైలాగ్స్ నే పాటగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది. “ఎంటర్ టైన్ మెంట్ నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో… నాకు బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫూల్…”, “నా బ్లడ్ లోనే హిస్టరీ ఉంది…” వంటి బాలయ్య డైలాగ్స్ కూడా కిర్రెక్కిస్తాయి. ఫస్ట్ సీజన్ లో సాగిన ఎపిసోడ్స్ లోని విజువల్స్ నూ, బిహైండ్ సీన్స్ లోని బిట్స్ నూ జత చేసి రూపొందించిన ఈ ఆంథెమ్ చూడగానే అభిమానులతో కేకలు పెట్టించేలా ఉంది. మొదటి సీజన్ లో బాలయ్య ‘అన్ స్టాపబుల్’కు వచ్చిన గెస్ట్స్ అందరూ ఈ ఆంథెమ్ లో మరోమారు కనిపిస్తారు. ఇక బాలకృష్ణ మేకప్ చేసుకొనే విజువల్స్, ఆయనకు నటరాజ్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేసిన చిత్రాలు సైతం అలరిస్తాయి. ఇవన్నీ చూసేస్తే ‘అన్ స్టాపబుల్’ సెకండ్ సీజన్ ఎప్పుడు వస్తుందా? అందులో ఎవరెవరు అతిథులుగా విచ్చేస్తారు? వంటి ఆలోచనలు కలగక మానవు. అక్టోబర్ లో ఈ సెకండ్ సీజన్ జనం ముందుకు రానుంది. మరి ఫస్ట్ సీజన్ తో రికార్డ్ స్థాయి వ్యూయర్ షిప్ సాధించిన ఈ ‘అన్ స్టాపబుల్’ సెకండ్ సీజన్ లో ఏ తరహా చరిత్ర సృష్టిస్తుందో చూడాలి.