‘చిన్నారి పెళ్ళికూతురు’ సీరియల్ తో తెలుగువారికీ చేరువైంది అవికా గోర్. ఆ తర్వాత పలు చిత్రాలలోనూ నాయికగా నటించిన అవికా ఇప్పుడు నిర్మాతగానూ మారింది. తాను నటిస్తున్న పలు చిత్రాలకు సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’ జూలై 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ”ఇదో స్వీట్ మూవీ. టెన్త్ క్లాస్ సభ్యులు రీయూనియన్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అంజీ ఈ మూవీతో దర్శకుడిగా మారారు. చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఆయన. ఈ కథ నా చుట్టూనే తిరుగుతుంది. శ్రీరామ్ గారి కాంబినేషన్ లో నాకు ఎక్కువ సీన్స్ లేవు కానీ నాకు తండ్రిగా నటించిన నాజర్ గారితో చాలానే సీన్స్ ఉన్నాయి” అని చెప్పింది. తన పుట్టిన రోజు జూన్ 30 అని, ఆ మర్నాడే ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉందని అవికా గోర్ తెలిపింది. ఈ సినిమా చూసే వారందరికీ తమ టెన్త్ క్లాస్ డేస్ గుర్తొస్తాయని, కానీ తనకు మాత్రం అలాంటి స్వీట్ మెమొరీస్ లేవని, బాలనటిగా టీవీ సీరియల్స్ లో నటించడం వల్ల స్కూల్ కు వెళ్ళడం కంటే… షూటింగ్స్ కు వెళ్ళిందే ఎక్కువ అని అవికాగోర్ చెప్పింది.
మిలింద్ వల్లే ఈ మార్పు!
ఇక పనిలో పనిగా అవికా గోర్ తన ప్రేమాయణం గురించి కూడా మీడియాతో ముచ్చటించింది. గత కొంతకాలంగా ఆమె మిలింద్ చంద్వానీతో డేటింగ్ చేస్తోంది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కొన్ని నెలల క్రితమే బహిర్గతం చేసింది. మిలింద్ తన జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయని చెబుతూ, ”నేను మరింత కాన్ఫిడెంట్‌గా తయారయ్యాను. నా కేపబిలిటీ ఏంటి అనేది నాకు తెలిసింది. నేను ఏం చేయగలనో తెలిసింది. నేను ఆలోచిస్తున్న దానికంటే ఇంకా చాలా చేయగలని తెలుసుకునేలా చేశాడు మిలింద్. నేను బరువు తగ్గడం నుంచి నిర్మాతగా మారడం వరకూ… నా ప్రతి అడుగులోనూ అతను ఉన్నాడు. నా ప్రయాణంలో నాకు అండగా నిలబడ్డాడు. అతడు లేకుండా నేను ఇదంతా చేయలేను” అని చెప్పింది. అయితే ఇద్దరూ పెళ్ళిపీటలు ఎక్కేది ఎప్పుడో మాత్రం అవికాగోర్ చెప్పనే లేదు!