Avatar-2: హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి అద్భుతాన్ని తెరపైకి తెస్తున్నారు. అవతార్‌కు సీక్వెల్‌గా అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఇప్పుడు అవతార్-2 రన్‌టైమ్ చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ రన్‌టైమ్ 3 గంటల 12 నిమిషాల 10 సెకన్‌లు అని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇంత నిడివి గల సినిమా రాలేదు. చివరకు ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా ఇంచుమించు మూడు గంటలు మాత్రమే ఉంది. దీంతో అన్ని థియేటర్లు షో టైమ్‌లన్నీ మార్చేస్తున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సాధారణంగా మార్నింగ్ షో 11 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే అవతార్-2 నిడివి దృష్ట్యా ఉదయం 9:30 గంటలకే మార్నింగ్ షోను ప్రారంభిస్తున్నారు. మ్యాట్నీ షో 1:30 గంటలకు, ఫస్ట్ షో సాయంత్రం 5:30 గంటలకు, సెకండ్ షో రాత్రి 9:30 గంటలకు వేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాయి.
Read Also: Pawan Kalyan: ఉస్తాద్ గా పవన్ గ్రాండ్ ఎంట్రీ.. భయమేస్తోంది అంటున్న ఫ్యాన్స్
మరోవైపు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మొదటి మూడు రోజులు చాలా ప్రాంతాల్లో 5 షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతి జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ప్రమోషన్ కార్యక్రమాలు లేకపోయినా ఈ సినిమాకు బుకింగ్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దీనికి కారణం అవతార్ ఫస్ట్ పార్ట్ సాధించిన విజయం అనే చెప్పాలి. తొలిరోజు ప్రదర్శనలకు సంబంధించి ఇప్పటిదాకా 2 లక్షల టికెట్లు అమ్ముడు కాగా, ఆలిండియా వ్యాప్తంగా రూ.7 కోట్ల గ్రాస్ వసూలైనట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కేజీఎఫ్-2, బాహుబలి-2 చిత్రాలు ఈస్థాయి వసూళ్లు రాబట్టగా ఇప్పుడు అవతార్-2 చిత్రం కూడా వాటి సరసన చేరడం విశేషం.
అటు వీకెండ్ టికెట్ల అమ్మకాల్లోనూ అవతార్-2 అదిరిపోయే అడ్వాన్స్ వసూళ్లు సొంతం చేసుకుంది. శని, ఆది వారాల్లో ఈ సినిమా ప్రదర్శనలకు 4.10 లక్షల టికెట్లు అమ్ముడైంది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా రూ.16 కోట్ల గ్రాస్ వసూలైనట్టు సమాచారం అందుతోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్‌ల రూపంలోనే అవతార్-2 సినిమా దాదాపు రూ.80 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.