Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కాంబో ఎట్టకేలకు నేడు కన్ఫర్మ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గబ్బర్ సింగ్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గతంలో ఇదే సినిమాను భవదీయుడు భగత్ సింగ్ గా ప్రకటించారు. ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా సెట్స్ మీదకు వెళ్ళలేదు ఈ సినిమా.. ఇక నేడు ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ మార్చి షూటింగ్ ను మొదలుపెట్టింది. పవన్-హరీష్ కలయికలో ఇప్పటిదాకా వచ్చింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన ప్రభంజనం కారణంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆదివారం ఉదయం 11.45 గంటలకు పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు మరియు పలువురు ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వి.వి. వినాయక్, కె.దశరథ్, మలినేని గోపీచంద్, బుచ్చిబాబు, నిర్మాతలు ఎ.ఎం. రత్నం, దిల్ రాజు, శిరీష్, విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి, రామ్ ఆచంట, గోపి ఆచంట, కిలారు సతీష్ హాజరయ్యారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా, ఎ.ఎం. రత్నం కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్ కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట, విశ్వప్రసాద్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందించారు.
ఇక ఉస్తాద్ గా పవన్ ఎంట్రీ అదిరిపోయింది. మిలటరీ షర్ట్, గుబురైన గడ్డంతో పవన్ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా తేరికి రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మేకర్స్ ఇప్పటివరకు నోరువిప్పలేదు. దీంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నా అది తేరి రీమేకా కాదా తెలిసే వరకు మనసు ప్రశాంతంగా ఉండదు అని చెప్పుకొస్తున్నారు. పవన్ లుక్ అదిరిపోయినా ఈ సినిమా మీద ఆశలు పెట్టుకోవాలా లేదా అనే సందిగ్ద పరిస్థితిని ఫ్యాన్స్ ఎదుర్కొంటున్నారు. ఇక మరోపక్క సినిమా ఏదైనా పవన్ లుక్ కోసం, పవన్ కోసం చూస్తామని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే