ఆగస్ట్ నెల ప్రారంభమే షూటింగ్స్ బంద్ తో మొదలైంది. దాంతో ఈ నెల ఎలా ఉంటుందో అని ఆందోళన చెందిన సినిమా వాళ్ళ నెత్తిన పాలు పోసినట్టుగా తొలి వారంతంలో విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలు ఘన విజయం సాధించి, శుభారంభాన్ని పలికాయి. నందమూరి కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేసిన ‘బింబిసార’కు ఆయనే నిర్మాత కావడం విశేషం. భిన్నమైన కథలకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడతారని ఆ సినిమా విజయం నిరూపించింది. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అదే రోజు విడుదలైన దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ బెస్ట్ ఫీల్ గుడ్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకోవడమే కాదు… స్థిరమైన కలెక్షన్లతో అందరినీ ఆకట్టుకుంది. సీనియర్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ ఖ్యాతిని మరింత పెంచింది ‘సీతారామం’ మూవీ. ఈ రెండు సినిమాల విజయంతో తెలుగు చిత్రసీమకు కొత్తగా ఊపిరి పోసినట్టు అయ్యింది.
ఆ తర్వాత వారం వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్యకూ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా తెలుగు వర్షన్ కు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించి, పబ్లిసిటీలో ప్రత్యక్షంగా పాల్గొన్నా జనాలు మాత్రం ఆదరించలేదు. ఆ వెనుకే వచ్చిన నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా పరాజయాన్నే చవిచూసింది. గాంధీ హత్యోదంతం నేపథ్యంలో వచ్చిన ‘అఖండ భారత్’ థియేటర్లలో సందడి చేయలేకపోయింది. అయితే… ఆగస్ట్ 13వ తేదీ శనివారం విడుదలైన నిఖిల్ సిద్ధార్థ్ ‘కార్తికేయ 2’ మూవీ ఎవ్వరూ ఊహించనంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన సైతం ఈ సినిమా జయకేతనం ఎగరేసింది. అదే వారం విడుదలైన ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ చిత్రాలను వెనక్కి తోసి ‘కార్తికేయ 2’ ముందుకు సాగింది. వరల్డ్ వైడ్ ‘కార్తికేయ 2’ రూ. 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, ఆగస్ట్ మాసంలో నెంబర్ వన్ మూవీగా నిలవడం విశేషం. అదేవారం ‘మాలిక్’, ‘మహామనిషి’, ‘కడవర్’ వంటి పరభాషా చిత్రాలు ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అయ్యాయి.
ఆగస్ట్ 18న భారీ అంచనాలతో వచ్చిన ధనుష్ ‘తిరు’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అదే నెల 19న స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఆది సాయికుమార్ ‘తీస్ మార్ ఖాన్’, సునీల్, అనసూయ ‘వాంటెడ్ పండుగాడ్’, ‘మాటరాని మౌనమిది’, ‘కమిట్ మెంట్’ జనం ముందుకు వచ్చాయి. కానీ ఏ ఒక్కటీ విజయాన్ని అందుకోలేదు. అదే వారం ఆనంద్ దేవరకొండ నటించిన ‘హైవే’ ఆహాలో డైరెక్ట్ స్ట్రీమింగ్ అయ్యింది. మలయాళ డబ్బింగ్ సినిమా ‘హెవెన్’, తమిళ అనువాద చిత్రం ‘తమిళ రాకర్స్’ కూడా ఓటీటీల్లో ప్రసారమయ్యాయి. కానీ ఏవీ వీక్షకులను మెప్పించలేదు.
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన ‘లైగర్’ ఆగస్ట్ 25న భారీ స్థాయిలో విడుదలైంది. ఇది వారి అభిమానులకే కాదు సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా తీవ్ర నిరాశను మిల్చింది. విజయ్ దేవరకొండ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇంతలా డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. అదే వారం స్ట్రయిట్ తెలుగు సినిమాలు ‘కళాపురం, కళింగపట్నం జీవా, పీకే’ వచ్చాయి. వశిష్ఠ, హెబా పటేల్ నటించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ డైరెక్ట్ గా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. బట్… ఈ సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. జూన్ లో వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’ గ్రాండ్ సక్సెస్ కావడంతో సీనియర్ స్టార్ హీరోల సినిమాలను జనం చూస్తారనే ఆశ కొందరిలో కలిగింది. దాంతో విక్రమ్ ‘కోబ్రా’ మూవీ మీద కూడా కాస్తంత అంచనాలు ఏర్పడ్డాయి. బట్… ఆగస్ట్ 31న వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మీద పగబట్టి తీసినట్టుగా ఉంది తప్పితే, మరొకటి కాదు! ఏదేమైనా ఈ నెలలో ఊహకందని పరాజయాల నడుమ కూడా ‘కార్తికేయ-2, సీతారామం, బింబిసార’ చిత్రాలు విజయం సాధించడం హర్షించదగ్గది. ఈ నెలలో 15 స్ట్రయిట్, 9 డబ్బింగ్… మొత్తం 24 సినిమాలు (ఓటీటీ రిలీజెస్ తో కలిపి) జనం ముందుకు వచ్చాయి.