ఆర్. వి. రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దీనిని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను ”కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2” చిత్రాలతో ప్యాన్ ఇండియన్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. ఇక ట్రైలర్ గమనిస్తే, అరిషడ్వర్గాలను జయించిన వారే మహనీయులు అవుతారు అనే పాయింట్ ను దర్శకుడు ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఇందులోని ప్రతి పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇలాంటి కథను ఇంతవరకూ ఇతర భాషల్లో సైతం ఎవరూ డీల్ చేయలేదనిపిస్తోంది. కామ, క్రోధ, మద, మాత్సర్యాలే మనిషి పతనానికి హేతువు అని పురాణాల్లో ఉంది. ఆ విషయాన్ని కమర్షియల్ అంశాలతో కలిపి చక్కని కృష్ణ తత్వాన్ని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తోంది.
Read Also: Naatu Naatu: మన పాటకి ఆస్కార్స్ లో గట్టి పోటీ ఇచ్చేది ఈ సాంగ్ మాత్రమే…
ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ”ఈ టైటిల్ నాకు బాగా నచ్చింది. అలాగే మై నేమ్ ఈజ్ నో బడీ అనేది బాగా అనిపించింది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందరూ తెలిసిన నటులే ఉన్నారు. మంచి ప్యాడింగ్ కనిపిస్తోంది. రీసెంట్ గా విడుదలైన మంగ్లీ పాట నాకు బాగా నచ్చింది. ఇలాంటి కథలు చేయాలంటే ధైర్యం చేయాలి. నిర్మాతలకు ఫస్ట్ మూవీ అయినా వారి ప్రయత్నం అభినందించదగ్గది” అని అన్నారు. నిర్మాతల్లో ఒకరైన శేషూ మారం రెడ్డి మాట్లాడుతూ, ” వైవిధ్యమైన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో కథనం, సంగీతం హైలైట్ గా నిలుస్తాయి” అని చెప్పారు. దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ, ”గత వారం విడుదల చేసిన శ్రీ కృష్ణ ఆంథెమ్ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే ఈ ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. మా నిర్మాతలు శేషు గారు, ఆర్ వీ రెడ్డి గార్ల సపోర్ట్ మర్చిపోలేనిది” అని అన్నారు. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, ‘శుభలేఖ’ సుధాకర్, సురభి ప్రభావతి, తమిళ బిగ్ బాస్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవల్లిక చుక్కల, సురభి విజయ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా, కాసర్ల శ్యామ్, వనమాలి సాహిత్యాన్ని సమకూర్చారు.