(అక్టోబర్ 9న ‘అపూర్వ సహోదరులు’కు 35 ఏళ్ళు)
నందమూరి బాలకృష్ణ నటజీవితంలో ఒకే యేడాది ఆరు వరుస విజయాలు చూడటం అన్నది మరపురాని విజయం. 1986లో ఈ విశేషం చోటు చేసుకుంది. ‘ముద్దుల క్రిష్ణయ్య’తో ఆరంభమైన ఆ ఘనవిజయం ‘అపూర్వ సహోదరులు’తో పూర్తయింది. 1986లో బాలకృష్ణ చివరి చిత్రంగా వచ్చిన ‘అపూర్వ సహోదరులు’ అక్టోబర్ 9న దసరా కానుకగా జనం ముందు నిలచింది. బాలకృష్ణ నటనాపర్వంలో తొలి ద్విపాత్రాభినయ చిత్రంగానూ ‘అపూర్వ సహోదరులు’ నిలచింది. ప్రేక్షక హృదయాలను గెలిచింది.
‘అపూర్వ సహోదరులు’ కథలో కొత్తదనం కొవ్వొత్తి పెట్టి వెతికినా కనిపించదు. అయితే తనదైన మార్కుతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని మలచిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక చిత్ర కథ విషయానికి వస్తే – రాజా నరేంద్రవర్మ ఆస్తిని కాజేయాలని వరుసకు ఆయన బావమరదులైన బంగార్రాజు, వరహాల రాజు పలు పథకాలు వేస్తుంటారు. ఆయన మొదటి భార్య మాలినికి పుట్టిన బిడ్డను చంపేస్తారు. రెండో భార్య పూర్ణకు కవలపిల్లలు పుడతారు. వారిలో ఓ బిడ్డను నర్సు సాయంతో మాలిని చెంతకు చేరుస్తారు నరేంద్రవర్మ. ఆ బాబునూ చంపాలని పలు ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఆ బాబు పెద్దవాడయి అరుణ్ కుమార్ పేరుతో రాజాలా తిరుగుతూ ఉంటాడు. మరో అబ్బాయి రాము పేరుతో ఓ దేశభక్తుని వద్ద పెరుగుతాడు. అరుణ్ కుమార్ దగ్గర స్వప్న అసిస్టెంట్ గా చేరుతుంది. డబ్బు పొగరుతో ఉన్న రోజాను ఆటట్టిస్తాడు రాము. రెండు జంటల్లోనూ ప్రేమ చిగురిస్తుంది. విలన్లు వీళ్లందరినీ మట్టుపెట్టాలని చూస్తారు. రాజా నరేంద్రవర్మ బందీగా ఉన్నాడని తెలుస్తుంది. చివరకు అన్నదమ్ములు ఒక్కటై దుండగులను ఆటపట్టించి, కన్నవారిని కాపాడుకోవడంతో కథ ముగుస్తుంది. ఈ కథలో పలు లూప్ హోల్స్ ఇట్టే కనిపిస్తాయి. అయినా రాఘవేంద్రరావు మార్కు పాటల చిత్రీకరణ, వినోదం ‘అపూర్వ సహోదరులు’ను విజయపథంలో నడిపాయి.
ఈ చిత్రంలో బాలకృష్ణ, విజయశాంతి, భానుప్రియ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, రాళ్ళపల్లి, రంగనాథ్, అన్నపూర్ణ, శుభ, కాంతారావు, నిర్మలమ్మ , రాజేశ్, సుత్తివేలు, చలపతిరావు, నర్రా వేంకటేశ్వరరావు నటించారు. ఈ చిత్రానికి కథను సునీల్ వర్మ అందించగా, సత్యానంద్ రచన చేశారు.వేటూరి పాటలు రాశారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఇందులోని “స్వప్నా ప్రియ స్వప్నా…”, “మై డియర్ రంభా… మై డియర్ మేనకా…”, “దొంగవా దోచుకో…”, “అప్పలమ్మ ఆడితే గొప్పగుంటది…”, “పిడుగంటి పిల్లొడు…” పాటలు ఆకట్టుకున్నాయి.
‘అపూర్వ సహోదరులు’ చిత్రం మొదటి వారం ఎనభై లక్షల రూపాయలు పోగేసి, ఆ సమయంలో విడుదలైన పోటీ చిత్రాలకంటే మిన్నగా వసూళ్లు చూసింది. బాలకృష్ణ తొలి ద్విపాత్రాభినయ చిత్రంగా నిలచింది. కె.రాఘవేంద్రరావు, ఆయన అన్న కె.కృష్ణమోహనరావు కలసి ‘ఆర్.కె.అసోసియేట్స్’ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘అపూర్వ సహోదరులు’. బాలకృష్ణతో రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రాలలో మంచి ఆదరణ పొందిన చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం!