82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్’ చిత్రానికి ఉత్తమ దర్శకురాలిగా అవార్డు అందుకున్న భారతీయ దర్శకురాలు అనుపర్ణ రాయ్, తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు క్లారిటీ ఇచ్చారు. అవార్డు గెలిచిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, పాలస్తీనా విషయం పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశ్యంతో కాదని స్పష్టం చేశారు.
Also Read : Rajasab : విఎఫ్‌ఎక్స్‌తో మ్యాజిక్ చేసిన మిరాయ్.. రాజా సాబ్ మీద హ్యారీ పోటర్ రేంజ్ హోప్స్ !
“నేను ఏమి చెప్పానో, దాని అర్థం అదే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపాలన్న ఉద్దేశ్యంతోనే నేను మాట్లాడాను. నేను పాలస్తీనా గురించి మాట్లాడుతున్నానంటే, నేను తక్కువ భారతీయురాలినని కాదు. ఇది నేను తొలిసారి మాట్లాడుతున్న విషయం కూడా కాదు. దేశంలోనో, నేపాల్‌లోనో లేదా మరెక్కడైనా జరుగుతున్న మారణహోమాలపై కూడా నేను ఎప్పుడూ స్పందిస్తాను” అని ఆమె వివరించారు. అలాగే, ఈ విజయం భారత్‌కి గర్వకారణమని, దాన్ని రాజకీయరంగంలోకి లాకుపోవద్దని ఆమె స్పష్టం చేశారు. “భారతదేశం సాధించిన విజయాన్ని మీరు సెలబ్రేట్ చేయలేకపోతే, కనీసం దాన్ని చెడుగా రాజకీయంగా మార్చకండి. నేను అసలు రాజకీయవేత్తను కాదు, ఎలాంటి రాజకీయ పార్టీకీ నేను ప్రాతినిధ్యం వహించన” అని అన్నారు.
ఈ సందర్భంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి కూడా మాట్లాడిన అనుపర్ణ, “అతను నాకు ఇప్పటి వరకు కలిసిన అత్యంత మధురమైన వ్యక్తి. పాలస్తీనా గురించి మాట్లాడవద్దని ఆయన సలహా ఇచ్చారు. కానీ, నేను ఆయన ప్రభావానికి లోనవ్వలేదు. నన్ను వామపక్షవాదినని, అనురాగ్ ప్రభావంతోనే మాట్లాడుతున్నానని ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం,” అని తేల్చి చెప్పారు. చివరిగా.. “నా గురువులు కూడా ఈ అంశంపై మాట్లాడవద్దని సలహా ఇచ్చారు. ఇప్పుడు వారు ఎందుకు అలా చెప్పారో నాకు అర్థమవుతుంది. కానీ, నేను చెప్పింది సత్యం. ఇది నన్ను తక్కువ భారతీయురాలిని చేస్తే, దానిని కూడా నేను అంగీకరిస్తాను. దాని గురించి నాకు ఎలాంటి బాధ లేదు’ అని స్పష్టంగా తెలిపారు.