జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డులను రెండుసార్లు అందుకున్నాడు నటుడు అనుపమ్ ఖేర్. 37 సంవత్సరాలలో వివిధ భాషల్లో 518 సినిమాలలో నటించాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు ఛైర్మన్ గా పనిచేశారు. పద్మశ్రీ , పద్మభూషణన్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన హిందీ సినిమా ‘సారాంశ్’ 37 సంవత్సరాల క్రితం మే 25న విడుదలైంది. ఆ రోజుల్ని తలుచుకుంటూ అనుపమ్ ఖేర్ ఇన్ స్టాగ్రామ్ లో అప్పటి సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఇప్పుడు యాక్ట్ చేసి, ఆ వీడియోను పోస్ట్ చేశారు. ‘సారాంశ్’ సినిమా ఇప్పుడు రీమేక్ చేసినా బాగుంటుందని, ఇప్పటికీ ఆ పాత్ర చేయడానికి తాను సిద్ధమేనని అన్నారు. ప్రతిష్ఠాత్మక రాజశ్రీ సంస్థ మహేశ్ భట్ దర్శకత్వంలో నిర్మించిన ‘సారాంశ్’ చిత్రంలో తన వయసుకు దాదాపు రెట్టింపు వయసున్న పాత్రను అనుపమ్ ఖేర్ పోషించారు. ఆయనకు అప్పట్లో 29 సంవత్సరాలు కాగా 60 సంవత్సరాల వృద్థుడి పాత్రను చేశారు. ఈ సినిమా విడుదల సమయంలోనే భివండీలో కలహాలు చెలరేగడం దురదృష్టకరం అన్నారు. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు విశేషంగా దక్కాయి. ‘సారాంశ్’ను ప్రదర్శిస్తున్న మెట్రో సినిమా థియేటర్ కు వెళ్ళి తాను బయట నిలబడే వాడినని, ఎవరైనా గుర్తుపడతారేమోనని చూసేవాడినని, అయితే తాను సినిమాలో పోషించింది వృద్ధుడి పాత్ర కావడంతో ఎవరూ గుర్తించలేకపోయేవారని అనుపమ్ ఖేర్ ఆనాటి రోజుల్ని తలుచుకున్నారు.