Ankita Lokhande:అంకితా లోఖండే.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అని చెప్పండి.. ఓ ఆమెనా పవిత్ర రిష్తా సీరియల్ నటి కదా అని చెప్పేస్తారు. అవును ఆమెనే అంకితా లోఖండే. సుశాంత్ చనిపోయిన తరువాత ఈమె పేరు బాగా పాపులర్ అయ్యింది. సుశాంత్ తో ఆరేళ్ళు ప్రేమలో ఉన్న అంకిత.. బ్రేకప్ చెప్పి మరొక వ్యక్తి విక్కీజైన్‌ను వివాహమాడింది. ఈ జంట హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్‌లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరిద్దరి మధ్య జరిగిన గొడవలు.. వాళ్ళ ఫ్యామిలీ బయట చేసిన గొడవ అంతా ఇంతా కాదు. ఇక ఎలాగైతేనేం టాప్ 5 లో అంకిత నిలిచింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అంకిత.. తాను ఎదుర్కున్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్నీ వివరించింది.
” అప్పుడు నాకు 19 ఏళ్ళు.. అప్పుడప్పుడే నాకు ఆఫర్లు వస్తున్నాయి. అంతలోనే నాకు ఒక సౌత్ సినిమాకు ఆడిషన్ కు వెళ్లాను. తరువాత ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీరు హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారని చెప్పుకొచ్చారు. నేను ఎగిరి గంతేశాను.. మా అమ్మకు కూడా చెప్పాను. ఇక వెంటనే.. వారి ఆఫీస్ కు వెళ్ళాను. అక్కడకు వెళ్ళాకా.. నాతో పాటు వచ్చిన వ్యక్తిని బయటే ఉంచి లోపలికి రమ్మన్నారు. సరే అని నేను లోపలికి వెళ్లాను. నాతో మాట్లాడిన అతను.. హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. అయితే మీరు కాంప్రమైజ్ కావాలి అని అన్నారు. నాకు ఏం చెప్తున్నారో అర్ధం కాలేదు. 19 ఏళ్ళ నేను.. కాంప్రమైజ్ మాటను అప్పుడే విన్నాను. అంతే అమాయకంగా కాంప్రమైజ్ అంటే ఏంటి అని అడిగాను. మీరు నిర్మాతతో ఒక రాత్రి పడుకోవాలి అని అన్నాడు. నాకసలు ఏం అర్ధం కాలేదు. మీ నిర్మాతకు టాలెంట్ అవసరం లేదనుకుంటా.. కేవలం ఒక అమ్మాయి తన పక్కన ఉంటే చాలనుకుంటున్నాడు. నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పి వచ్చేసాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.