టాలీవుడ్ బాక్సాఫీస్ కు ‘సంక్రాంతి’ అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అదొక యుద్ధం. ముఖ్యంగా ‘హిట్ మెషిన్’ అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ అంటే విడదీయలేని అనుబంధం ఉంది ఈ క్రమంలోనే వచ్చే ఏడాది అంటే 2027 సంక్రాంతి బరిలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమాతో పలకరించాలని అనిల్ గట్టి ప్లాన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. అయితే, ఫిలిం నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి ఈ రేసు నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మరేదో కాదు, వెంకటేష్ నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ నిజానికి 2026 దసరా కానుకగా విడుదల కావాల్సి ఉంది.
కానీ, షూట్ లేట్ కావడం లాంటి కొన్ని తాజా పరిణామాల దృష్ట్యా ఈ చిత్రం వాయిదా పడి 2027 సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తోంది. ఒకే హీరో (వెంకటేష్) నటించిన రెండు భారీ సినిమాలు ఒకే పండగ సీజన్‌లో రావడం ట్రేడ్ పరంగా అస్సలు సాధ్యం కాదు. దీనివల్ల వసూళ్లపై ప్రభావం పడటమే కాకుండా థియేటర్ల సర్దుబాటు కూడా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి వెనక్కి తగ్గక తప్పదని టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి మిస్ అయితే, ఈ మల్టీస్టారర్ సినిమాను సమ్మర్ రేసులోకి తీసుకెళ్లే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీ-అనిల్ కాంబోలో ఇప్పటికే వచ్చిన సినిమాలు సంక్రాంతికి సందడి చేశాయి, కానీ ఈసారి ‘ఆదర్శ కుటుంబం’ అడ్డంకిగా మారడంతో అనిల్ రావిపూడి తన సెంటిమెంట్‌ను పక్కన పెట్టాల్సి రావచ్చు. కానీ సంక్రాంతిని అనిల్ అంత ఈజీగా వదిలే రకం కాదు, ఈ వాయిదాపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
