“పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!” అని సుమతీ శతకంలో పేర్కొన్నట్లు, ఒక తండ్రికి కుమారుడు పుట్టినప్పుడు కాదు, అతని విజయాన్ని చూసి జనం పొగిడినప్పుడే అసలైన పుత్రోత్సాహం. ఆ అసలైన పుత్రోత్సాహాన్ని ఈరోజు అనిల్ రావిపూడి తండ్రి ఫీలయ్యారు. అనిల్ రావిపూడి తండ్రి రావిపూడి బ్రహ్మయ్య గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థలో ఒక డ్రైవర్‌గా పనిచేసేవారు. ఈ విషయాన్ని గతంలోనే అనిల్ రావిపూడి పలు సందర్భాలలో వెల్లడించారు.
Also Read:Yash Toxic Teaser: యష్ ఫ్యాన్స్.. ‘టాక్సిక్’ సర్‌ప్రైజ్‌కు రడీగా ఉన్నారా!
అయితే, ఇప్పుడు తన కుమారుడు పెద్ద డైరెక్టర్ అయిపోవడంతో, రిటైర్మెంట్ తర్వాత కుమారుడు డైరెక్టర్‌గా పనిచేసే సినిమాలకే ప్రొడక్షన్ మేనేజర్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అనిల్ డైరెక్ట్ చేసే సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ కూడా ఉంటారు. అయితే, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన హైలైట్ అయ్యారు. అనిల్ రావిపూడి వెనుక సీటులో కూర్చున్న ఆయన, అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌లతో పాటు తన కుమారుడు అనిల్ రావిపూడి వెనుకే ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తూ, తన కుమారుడి వైభవాన్ని చూస్తూ ఎమోషనల్ అవ్వడం వీడియోలలో కనిపిస్తోంది. మొత్తంగా ‘ఇది కదా అసలైన పుత్రోత్సాహం’ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.