సునీల్, అనసూయ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు సలీమ్ మాలిక్ దర్శకుడు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్న ‘దర్జా’ మూవీ రిలీజ్ డేట్ ను శనివారం చిత్ర బృందం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ‘గుడుంబా శంకర్’ ఫేమ్ వీరశంకర్ తో పాటు సీనియర్ పాత్రికేయులు ప్రభు, వినాయక రావు పాల్గొన్నారు.

తమ చిత్రాన్ని ఈ నెల 22న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ (సత్తిపండు), శిరీష, షకలక శంకర్, పాల్ రామ్, మిర్చి హేమంత్, ‘ఛత్రపతి’ శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు ఇతర ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి రాప్ ర్యాక్ షకీల్ సంగీతం అందించారు. ఇందులో అన్ని వర్గాలను అలరించే అంశాలు ఉన్నాయని, అనసూయ పోషించిన పాత్ర ఫెరోషియస్ గా ఉండి అందరినీ ఆకట్టుకుంటుందని దర్శకుడు సలీమ్ మాలిక్ చెప్పారు.