మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో గురువారం తెలుగువారి ముందుకు వస్తున్న సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతకంపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీనటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఫారెస్ట్ గంప్’ దీనికి మాతృక.
ఈ మూవీ మేకింగ్ విశేషాల గురించి నాగచైతన్య బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ”అమీర్ ఖాన్ లాంటి వారితో కలసి నటించడం చాలా గ్రేట్ అనిపించింది. ఆయనతో యాక్ట్ చేయడ వల్ల ఎంతో నేర్చుకొన్నాను. కొన్ని సినిమాలు చేసిన తరువాత అందులో చేసిన ఎక్స్ పీరియన్స్ , మూమెంట్స్ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. అలాంటిదే ఈ సినిమా కూడా. అయితే ఇందులో నాది కేవలం 20 నుండి 30 నిమిషాల నిడివి ఉండే పాత్ర. ఫస్ట్ టైం నాకు కాల్ వచ్చినప్పుడు నమ్మలేదు. సాయంత్రం అమీర్ ఖాన్ డైరెక్టర్ అద్వైత్ చందన్ వీడియో కాల్ చేసి మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. ప్రీ-ప్రొడక్షన్ కు చాలా టైమ్ తీసుకోవడం వలన షూట్ చాలా ఈజీ అయింది. సినిమాలో లాల్ పాత్రలో నటించిన అమీర్ కు ఎన్ని కష్టాలు వచ్చినా బయటికి చూపించకుండా, అద్భుతంగా నటించారు. ఆయన చాలా డిసిప్లేన్, పర్ఫెక్షన్ ఉన్న వ్యక్తి” అని అన్నారు.
ఈ మూవీలో తన పాత్ర గురించి చెబుతూ, ”గుంటూరు జిల్లాలోని బోడిపాలెం దగ్గర పుట్టిన బాలరాజు ఆర్మీలో జాయిన్ అయిన విధానం ఇందులో చక్కగా చూపించారు. ఈ మూవీలో తెలుగు నేటివిటీ చాలావరకూ కనిపిస్తుంది. ఈ మూవీ షూటింగ్ తెలుగు జిల్లాలలో కూడా జరిగింది. చిరంజీవి గారు పర్సనల్ గా తీసుకొని దీనిని విడుదల చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పటివరకు ఈ సినిమా చూసిన వారందరూ చాలా బాగుందని చెప్పడం సంతోషంగా ఉంది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారని ఈ మధ్య వచ్చిన రెండు సినిమాలు నిరూపించాయి. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చడమే కాకుండా చూసిన ప్రతి భారతీయుడు దీనిని సొంతం చేసుకుంటాడు” అని చెప్పారు.
ఆ మధ్య తాను చేసిన ‘వెంకీ మామ’లోని ఆర్మీ పాత్రకు ఇందులోని పాత్రకు తేడా ఉందని చెబుతూ, ”అందులో ఆర్మీ పర్సన్ గా చేసినా, దానికి దీనికి ఎంతో వ్యత్యాసం ఉంది. కార్గిల్ లో జరిగిన ఒక సీన్ ను తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది. ఇందులో కార్గిల్ వార్ సీక్వెన్స్ ఉంటాయి. హిందీలో ఇది నా ఫస్ట్ డబ్ల్యు మూవీ. అక్కడ కూడా నా మార్కెట్ పెరుగుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నాను. అదే సమయంలో ఇది పాన్ ఇండియా మూవీ కావడం నెర్వస్ గా కూడా ఉంది. అద్వైత్ చందన్ చాలా మంచి డైరెక్టర్. తను నన్ను చాలా బాగా గైడ్ చేశాడు” అని అన్నారు. ఈ యేడాది ఇప్పటికే నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’, ‘ధ్యాంక్యూ’ చిత్రాలు విడుదలయ్యాయి. గురువారం రాబోతున్న ‘లాల్ సింగ్ చడ్డా’ ఈ యేడాది వస్తున్న చైతు మూడో చిత్రం.