Amitabh Bachchan: ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్న అమితాబ్ బచ్చన్ కు ప్రమాదాలు కొత్త కాదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్ లో మరోమారు అమితాబ్ ప్రమాదానికి గురయ్యారు. అసలు అది ప్రమాదమే కాదు అన్నట్టుగా తొలుత వినిపించింది. స్వయంగా అమితాబ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో జరిగిన సంఘటనను వివరించాక, నిజమే అనుకున్నారు. ఏదో చిన్న ప్రమాదమట అంటూ కొందరు చాటింపు వేశారు. నిజానికి అది మేజర్ ఇంజురీ అని తెలుస్తోంది. ఎందుకంటే రిబ్స్ కు బలమైన దెబ్బ తగిలింది. ఛాతీ ఎముకలకు ఏ విధమైన గాయం తగిలినా, కోలుకొనేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాదు, విశ్రాంతి మినహా ఆ దెబ్బలకు సరైన చికిత్స లేదనే చెప్పాలి. అందువల్ల ఈ సారి అమితాబ్ కు జరిగిన ప్రమాదం చిన్నదే అంటూ కొట్టిపారేయడానికి లేదు. అందువల్ల అమితాబ్ అభిమానులందరూ ఆయన మళ్ళీ ఎప్పటిలా తిరగాలని ప్రార్థిస్తున్నారు. అమితాబ్ సైతం ప్రేక్షకుల దీవెనలే తనకు అసలైన వైద్యం అనీ భావిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ కెరీర్ లో పలు ప్రమాదాలు ఎదుర్కొన్నారు. వాటిలో ప్రమాదకరమైనవీ ఉన్నాయి. ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్నవీ లేకపోలేదు. అమితాబ్ బచ్చన్ ను స్టార్ గా నిలిపిన చిత్రం ‘జంజీర్’. ఆ సినిమాలో డూప్ లేకుండా అమితాబ్ చేసిన ఫైట్స్ ఆ రోజుల్లో జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా సమయంలో అమితాబ్ వయసు అక్షరాలా 31 సంవత్సరాలు. ఆ వయసు వేగంతో తరువాత కూడా అమితాబ్ బచ్చన్ డూప్ లేకుండానే ఫైట్స్ చేస్తూ సాగారు. కొన్నిసార్లు రిస్కీ షాట్స్ లోనూ హుషారుగా పాల్గొని అలరించారు. ‘డాన్’ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్, హీరోయిన్ జీనత్ అమన్ మధ్య ఓ చేజ్ ఉంటుంది. ఆ సమయంలో ఆయన ఎగురుతూ సరైన టైమింగ్ లో ల్యాండ్ కాలేక పోయారు. దాంతో మెడ భాగంలో గాయమయింది. ఇప్పటికీ అది అప్పుడప్పుడూ సలుపుతూనే ఉంటుంది. ఆ సమయంలో నెక్ బ్రేస్ వేసుకుంటూ ఉంటారు అమితాబ్. ఈ విషయాన్ని ‘పికూ’ షూటింగ్ సమయంలో బయట పెట్టారు అమితాబ్.
‘డాన్’ తరువాత ‘కూలీ’ సినిమా షూటింగ్ బెంగళూరులో జరుగుతూ ఉండగా, యాక్షన్ సీన్ చిత్రీకరణలో అమితాబ్ ఉదరంలో బలమైన గాయమైంది. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ కోలుకోవడం కష్టం అన్నారు. అయితే ఆయన ఆత్మస్థైర్యం, అభిమానుల ప్రార్థనలు ఫలించి, మళ్ళీ కోలుకున్నారు. ‘కూలీ’ సినిమా సమయంలో అమితాబ్ కు జరిగిన యాక్సిడెంట్ మేజర్ అని ఇప్పటికీ చెప్పుకుంటారు. హైదరాబాద్ లో ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ జరుగుతూ ఉండగా, జరిగిన ప్రమాదం కూడా ‘మేజర్’ అనే అంటున్నారు. కానీ,కొందరు కాదని కొట్టి పారేస్తున్నారు. ఇక్కడ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి, ప్రస్తుతం అమితాబ్ వయసు 80 సంవత్సరాలు. ఈ వయసులో పక్కటెముకలకు బలమైన గాయం అంటే చిన్న విషయం కాదు. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ఎప్పటిలా నవ్వుతూ షూటింగ్ కు వస్తారని ‘ప్రాజెక్ట్ కే’ చిత్ర బృందం ఆశిస్తోంది. అమితాబ్ కు ప్రమాదం జరిగిన ‘డాన్, కూలీ’ సినిమాలు సూపర్ హిట్ అయినట్టే, ఈ ‘ప్రాజెక్ట్ కే’ సైతం విజయఢంకా మోగిస్తుందనీ అభిమానులు అంటున్నారు.
“డాన్, కూలీ” చిత్రాలే కాదు, అమితాబ్ నటించిన మరికొన్ని సినిమాల్లోనూ ప్రమాదాలకి గురయ్యారు. అయితే వాటిని అమితాబ్ అంతగా చెప్పుకోలేదనీ ఆయన సహ నటులు అంటున్నారు. ‘మేజర్ సాబ్’ సమయంలోనూ ఆయన ప్రమాదానికి గురైనా, దానిని లెక్క చేయకుండా షూటింగ్ లో పాల్గొన్నారని అజయ్ దేవగన్ గుర్తు చేసుకున్నారు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రామ్ షూటింగ్ సమయంలోనూ అమితాబ్ బచ్చన్ కాలికి అనుకోకుండా గాయమైంది. ఓ ఇనుపముక్క కారణంగా నరం తెగడంతో రక్తం ధారగా చాలాసేపు కారింది. వైద్యులు సరైన చికిత్స చేయడం వల్ల ప్రమాదం తప్పిందని అప్పట్లో అమితాబ్ తెలిపారు. ‘తీన్’ సినిమా షూటింగ్ లోనూ కింద పడడం వల్ల రిబ్స్ కు గాయమైంది. అయితే అది అంత బలమైనది కాకపోవడంతో కొద్ది రోజులకే కోలుకున్నారు అమితాబ్. ‘కూలీ’ సమయంలో ప్రమాదం నుండి బయటపడ్డ అమితాబ్ ను అందరూ ‘మృత్యుంజయుడు’ అని కీర్తించారు. ఈ సారి కూడా అమితాబ్ అలాగే కోలుకుంటారని ఆశిద్దాం.