అడివి శేష్ టైటిల్ రోల్‌లో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మేజర్’ సినిమాపై సర్వత్రా ప్రశంసలు వచ్చి పడుతున్నాయి. ఒక మంచి సినిమా తీశారని యూనిట్ సభ్యుల్ని శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. సాధారణ ఆడియన్సే కాదు, సినీ ప్రముఖులు సైతం ఈ చిత్రంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. రీసెంట్‌గా ఈ సినిమా చూసి ఫిదా అయిన బన్నీ, తన అనుభూతిని ట్విటర్ మాధ్యమంగా పంచుకున్నాడు.
‘‘మేజర్ సినిమాను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. దర్శకుడు శవి కిరణ్ తిక్కా మంచి పనితనాన్ని చాటారు. ఇలాంటి సినిమాను నిర్మించినందుకు, ప్రేక్షకులకు అందించినందుకు సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకి శుభాకాంక్షలు. మీ మీద నాకు మరింత గౌరవం పెరిగింది. మేజర్.. ఇది ప్రతీ భారతీయుడి మనసుని తాకే చిత్రం’’ అని బన్నీ ట్వీట్ చేశాడు. అంతేకాదు.. అడివి శేష్ మరోసారి తన మ్యాజిక్ చూపించాడని, ఇతర ఆర్టిస్టులందరూ మనసుల్ని కట్టి పడేసే ప్రదర్శనతో మెప్పించారని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా.. మేజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మంచి వసూళ్ళు నమోదు చేస్తోంది. అంచనాలకి తగినట్టుగా ఇది ఆకట్టుకోవడంతో జనాలు థియేటర్ల ముందు బారులు తీరుతున్నారు.
ఒక్క తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ, మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. అక్కడ భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పృథ్వీరాజ్’పై కూడా ఈ సినిమా ప్రభావం పడిందంటే, ఇది ఎంతలా అక్కడి ఆడియన్స్‌ని ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో అడివి శేష్ సరసన సాయీ మంజ్రేకర్ కథానాయికగా నటించగా, శోభితా ధూళిపాళ్ల ఓ కీలక పాత్ర పోషించింది.
Excellent work by director @SashiTikka. Beautifully crafted . Big congratulations & my personal respect to the producer @urstrulyMahesh garu for giving the audience such a heartwarming experience & @AplusSMovies . Major : A story that touches every Indian heart.
— Allu Arjun (@alluarjun) June 4, 2022