Allu Arjun: వైవిధ్యంతో అలరిస్తున్నారు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్. ఆయన స్టైలిష్ యాక్టింగ్ ‘స్టైలిష్ స్టార్’గా నిలిపింది. ఇప్పుడు ‘ఐకాన్ స్టార్’ అనీ అనిపించుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. అలరించడమే కాదు, అందుకు తగ్గట్టుగా గ్యాప్ లేకుండా ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎందుకంటే ‘అల…వైకుంఠపురములో’ సినిమా తరువాత దాదాపు 23 నెలలకు ‘పుష్ప: ద రైజ్’తో జనం ముందు నిలిచారు అల్లు అర్జున్. ఆ సినిమా విడుదలై, ఏడాదిన్నర కావొస్తున్నా, బన్నీ మూవీ జనాన్ని పలకరించలేదు. పైగా ‘పుష్ప’ సీక్వెల్ గా రూపొందుతోన్న ‘పుష్ప- ద రూల్’ సినిమా వచ్చే యేడాది అంటే 2024లో వెలుగు చూడనుంది. మరీ ఇంత గ్యాప్ అయితే ఎలా చెప్పండి అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. వారి మాటలోనూ న్యాయముంది కదా! అన్నది సినీఫ్యాన్స్ మాట! ఏదేమైనా ‘పుష్ప’ రెండో భాగాన్ని చూసేయడానికి ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.
బన్నీ తాత అల్లు రామలింగయ్య మహా హాస్యనటుడు. తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఎంతో పేరున్నవారు. మరోవైపు మేనమామ చిరంజీవి అభినయం ఆరంభం నుంచీ బన్నీని ఆకట్టుకుంటూనే ఉంది. ఇలా ఎటు చూసినా, బన్నీ మనసును సినిమారంగంవైపు తీసుకువెళ్ళే అంశాలు చుట్టూ ఉండేవి. మామ చిరంజీవి డాన్సుల్లోనూ, ఫైట్స్ లోనూ మేటి అనిపించుకున్నారు. అదే పంథాలో పయనించాలని బన్నీ మొదట్లోనే డాన్సుల్లో రాణించారు. చిరంజీవితో అల్లు అరవింద్ నిర్మించిన ‘డాడీ’ సినిమాలో బన్నీ కాసేపు డాన్స్ చేస్తూ కనిపించి, ఎంతగానో ఆకట్టుకున్నారు. తరువాత తండ్రి ప్రోత్సాహంతో ‘గంగోత్రి’ ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ‘గంగోత్రి’ బన్నీకి మంచి మార్కులే సంపాదించి పెట్టింది. ఈ యేడాదితోనే ‘గంగోత్రి’ ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంటే బన్నీ హీరోగా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలయిందన్న మాట. ఈ ఇరవై ఏళ్ళలో బన్నీ సాగిన తీరు జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ‘ఆర్య’గా అలరించారు, ‘దేశముదురు’గా మురిపించారు, ‘బన్నీ’గా భమ్ చిక భమ్ ఆడేశారు. ఇలా ఏది చేసినా బన్నీ చిత్రాల్లో ఏదో ఓ వైవిధ్యం కనిపించేది. అదే ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తొలి నుంచీ కష్టపడి పనిచేయడం బాగా అలవాటయిన బన్నీ తన దరికి చేరిన ప్రతి పాత్రలోనూ తొలి సినిమాలో నటిస్తున్నట్టే భావించి నటించాడు. “బద్రీనాథ్, వేదం, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి” వంటి చిత్రాలతో నటునిగా మంచి మార్కులు కొట్టేసిన బన్నీ, ‘రేసుగుర్రం’తో మరో సాలిడ్ హిట్ పట్టేశారు. అయితే వాటితో బన్నీకి ఆనందం కలగలేదు. ఎందుకంటే తన సీనియర్స్, తన తరం హీరోలు ఏదో ఒక సందర్భంలో బ్లాక్ బస్టర్స్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. బన్నీకి భలేగా విజయాలు నమోదు అయ్యాయే కానీ, ‘ఈ సంవత్సరం నాది’ అని చెప్పుకొనే స్థాయిలో బ్లాక్ బస్టర్ పడలేదు. అల్లు అర్జున్ అభిలాషను తీర్చడానికి అన్నట్టు త్రివిక్రమ్ అతనికి ‘అల…వైకుంఠపురములో’ వంటి బంపర్ హిట్ ను అందించారు. బన్నీ ఆశించిన బంపర్ హిట్ ఆయన సొంతమయింది. ఈ సినిమా వసూళ్ళలో ‘నాన్-బాహుబలి’ రికార్డును సొంతం చేసుకోగా, పాటల్లో మాత్రం ఎవరికీ అందనంత ఎత్తున నిలచింది. ఇక ‘పుష్ప’లో ‘పుష్పరాజ్’గా అల్లు అర్జున్ అభినయం చూసిన వారెందరో ఆయనను అభినందించారు. బన్నీకి తొలి పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘పుష్ప’ ఉత్తరాదిన సైతం ఆయనకు ఓ స్పెషల్ క్రేజ్ ను సంపాదించి పెట్టింది. ప్రస్తుతం ‘పుష్ప’ సీక్వెల్ రూపొందుతోంది. మరి ఈ సారి పుష్పరాజ్ ఏ తీరున జనాన్ని కట్టిపడేస్తాడో చూడాలి.