ఫలానా పాత్రకు ఎవరెవరిని తీసుకోవాలన్న నిర్ణయాలు.. దాదాపు దర్శకులే చేస్తారు. ఆయా పాత్రల్లో ఎవరు సెట్ అవుతారో దర్శకులుగా వాళ్లకి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి, నిర్మాతలు వారికే ఆ బాధ్యతలు అప్పగిస్తారు. కానీ, పక్కా కమర్షియల్ సినిమా కోసం హీరోయిన్ విషయంలో తాను జోక్యం చేసుకున్నానంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కుండబద్దలు కొట్టారు నిర్మాత అల్లు అరవింద్. మారుతి తనకు కథ చెప్తున్నప్పుడు.. కథానాయిక పాత్రలో తనకు రాశీ ఖన్నానే కనిపించిందని, ఆమెనే ఇందులో హీరోయిన్ గా తీసుకోవాలని తాను చెప్పానని అన్నారు. తాను చెప్పడం వల్లే రాశీకి ఈ చిత్రంలో ఆఫర్ వచ్చిందన్నారు.
తాను ఆశించినట్టుగానే లాయర్ పాత్రలో రాశీ ఖన్నా అదరగొట్టేసిందని, కచ్ఛితంగా ఆమె రోల్ అందరికీ నచ్చుతుందని తెలిపారు. రాశీ, గోపీచంద్ కాంబోలో వచ్చిన సన్నివేశాలైతే సినిమాలో హైలైట్ గా నిలుస్తాయన్నారు. ఇక దర్శకుడు మారుతి ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వ్యక్తి అని, సెట్స్ మీదకి వెళ్లాక స్క్రిప్ట్ కంటే భిన్నంగా సీన్లను తీర్చిదిద్దుతాడని, ఈ మార్పులేంటని ప్రశ్నిస్తే థియేటర్లో చూశాకే మీకే అర్థమవుతుందని చెప్తాడని, అతడు అన్నట్టుగానే ఆడియన్ గా తాను సినిమా చూసినప్పుడు అతని మార్పులు చాలా బాగా నచ్చాయన్నారు. ఎలాగైనా ఒప్పించి, ఆడియన్స్ ని నవ్వించే ట్యాలెంట్ మారుతి సొంతమని.. ఒకప్పుడు ఈ ప్రతిభ ఈవీవీలో చూశామని కొనియాడారు.
ఇక గోపీచంద్ కోరిక మేరకే చిరంజీవిని అతిథిగా పిలిచామని, అడిగిన వెంటనే ఒప్పుకొని ఈవెంట్ కి వచ్చినందుకు చిరుకి తెలిపారు అల్లు అరవింద్. చిరంజీవి, గోపీచంద్ తండ్రి కలయికలో అప్పట్లో సినిమా ప్లాన్ చేశామని.. కానీ అది కుదరలేదని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తమ బ్యానర్ లో గోపీచంద్ తో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ఆడియన్స్ కు తప్పకుండా నచ్చుతుందని, జులై 1వ తేదీన థియేటర్ కు వెళ్లి అందరూ చూడాలని ఆయన కోరారు.