Pokiri : All that money goes to Mahesh Babu Foundation!
ఆగస్ట్ 9వ తేదీ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా పలు కేంద్రాలలో ‘పోకిరి’ సినిమా స్పెషల్ షోస్ ను అభిమానులు నిర్వహిస్తున్నారు. ఆ స్పెషల్ షోస్ కు సంబంధించిన సమాచారం రావడం ఆలస్యం షోస్ అన్నీ కూడా హౌస్ ఫుల్ అయిపోతున్నాయి. విశేషం ఏమంటే… ఇలా ప్రపంచ వ్యాప్తంగా స్పెషల్ షోస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని నిర్వాహకులు మహేశ్ బాబు ఫౌండేషన్ కు విరాళంగా అందచేయబోతున్నారు. గత కొన్నేళ్ళుగా మహేశ్ బాబు పలు సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పల్లెటూళ్ళను దత్తత్తు తీసుకుని, వసతులు కల్పించడంతో పాటు, గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా శస్త్ర చికిత్స చేయిస్తున్నారు. ఆ ఫౌండేషన్ ద్వారా జరిగే సేవా కార్యక్రమాలకు తమ వంతు సాయం అందించే నిమిత్తం… ఈసారి ‘పోకిరి’ స్పెషల్ షోస్ ద్వారా వచ్చే మొత్తాన్ని నిర్వాహకులు విరాళంగా ఇవ్వబోతున్నారు. చిత్రం ఏమంటే మహేశ్ బాబు ‘పోకిరి’ స్పెషల్ షోస్ కు వస్తున్న స్పందనను చూసి, మరికొందరు స్టార్ హీరోస్ అభిమానులు సైతం ఇలా స్పెషల్ షోస్ ను ప్లాన్ చేస్తున్నారు. మరి వారు కూడా ఇదే తరహాలో సేవా కార్యక్రమాలను ఆ మొత్తాలను విరాళంగా ఇస్తారేమో చూడాలి.