బాలీవుడ్ లో ప్రస్తుతం అందరు అలియా- రణబీర్ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. కాగా ఏప్రిల్ 16 న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నది బీ టౌన్ కోడై కూస్తుంది. ఇక ఏప్రిల్ చివరివారం రిసెప్షన్ ఉండనున్నదట. ఇక ఈ వెడ్డింగ్ గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలియా- రణబీర్ తమ పెళ్లిని చాలా గోప్యంగా ఉంచాలని చూస్తున్నారట. అభిమానుల హంగామా లేకుండా కేవలం బంధుమిత్రుల మధ్య ఒక్కటి కావాలనుకుంటున్నారట. అందుకోసం వీరు ప్రత్యేకంగా తమ వెడ్డింగ్ టీమ్ ని కాంట్రాక్టు అడుగుతున్నారట. ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, పెళ్లి పనులు చేసేవారు, డెకరేషన్ టీమ్, డీజే టీమ్, డిజైనర్ టీమ్ ఇలా పెళ్లి కోసం పనిచేసే ప్రతిఒక్కరి వద్ద కాంట్రాక్ట్ రాయించుకొని సంతకాలు పెట్టించుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
పెళ్లి అయ్యే వరకు ఎటువంటి ఫొటోస్, వీడియోస్ లీక్ కాకుండా చూడాలని, ఒకవేళ పొరపాటున లీక్ అయితే కఠిన చర్యలు తప్పవని ఆ కాంట్రాక్ట్ లో రాసి ఉందట. కత్రినా కైప్, విక్కీ కౌశల్ కూడా తమ పెళ్లి సమయంలో ఇటువంటి కాంట్రాక్ట్ నోట్‌పై సంతకం చేయమన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట కూడా వారినే ఫాలో అవుతున్నారట. ఇకపోతే కత్రినా పెళ్లి ఎంత సీక్రెట్ గా జరిగినా అభిమానులు ఎక్కడో ఒక చోట నుంచి ఫోటోలు తీయడం, అవి కాస్త వైరల్ గా మారడం జరిగిపోయాయి. ఇక వీరి పెళ్ళిలో కూడా అలాంటివే జరుగుతాయి అని అభిమానులు అంటున్నారు. చూడాలి ఈ అందమైన జంట వెడ్డింగ్ లో ఇంకెంత అందంగా ముస్తాబవుతారో..