బాలీవుడ్ ప్రేమాయణాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకున్నా, యావద్భారతంలోని సినీ ఫ్యాన్స్ కు భలే ఆసక్తి! ఈ మధ్య కాలంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రేమ సొదలే ముంబైలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకూ ఈ జంట ఎప్పుడు పెళ్ళి పీటలెక్కుతుందీ అనీ అందరూ ఎదురుచూస్తున్నారు. ఇరువైపుల పెద్దల అంగీకారంతోనే అలియా, రణబీర్ ఒక్కటి కాబోతున్నారు. ఆ మాటకొస్తే వారిద్దరికీ ఎప్పుడో పెళ్ళయిందనీ, ఇప్పుడు అధికారికంగా జనానికి తెలిసేలా పెళ్ళి చేసుకోనున్నారని బాలీవుడ్ బాబులు చెబుతున్నారు. ఏప్రిల్ 17న అలియాను రణబీర్ భార్యగా చేసుకుంటున్నాడని తెలుస్తోంది!
ఇన్నాళ్ళూ లేనిది ఇప్పుడెందుకు? అలియా తాత ఎన్.రజ్దాన్ కు ఆరోగ్యం అంతా బాగోలేదో. అందువల్ల ఆయన కన్నుల ముందే వారి పెళ్ళి జరిగితే బాగుండునని ఏప్రిల్ 17వ తేదీన వారి కళ్యాణోత్సవంగా నిర్ణయించారు. రజ్దాన్ పరిస్థితి మరీ విషమిస్తే, ఈ తేదీ ముందుకు జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదని అంటున్నారు.
ఈ మధ్యకాలంలో అమ్మాయి కంటే అబ్బాయి వయసులో పెద్ద తేడా ఉండడం లేదు. మరికొన్ని చోట్ల అమ్మాయే అబ్బాయి కన్నా ఒకటి రెండేళ్ళు పెద్దగా ఉంటోంది. ఈ వయసు తేడా కథ ఎందుకంటారా? పాతకాలంలో లాగా అలియా కంటే రణబీర్ దాదాపు పదకొండేళ్ళు పెద్దవాడు. ఇక రణబీర్ ప్రేమాయణంలో ఇంతకు ముందు కత్రినా కైఫ్, దీపికా పదుకొణే వంటి భామలూ ఉన్నారు. అయినా దాదాపు నలభై ఏళ్ళ రణబీర్ లో అలియాకు నచ్చిందేంటి చెప్మా! అనుకుంటున్నారు బాలీవుడ్ జనం. ఎల్లలు లేని ప్రేమకు వయోభేదాలు, ఇతర తేడాలు అడ్డురావని అలియా నిరూపించిందనీ కొందరి మాట! ఏది ఏమైనా అందరినీ ఆకర్షిస్తోన్న అలియా, రణబీర్ వివాహం ఏప్రిల్ 17న ఏ స్థాయిలో జరుగుతుందో చూడాలన్న ఆసక్తి ఇప్పుడు బాలీవుడ్ జనంలో నెలకొంది. అయితే పరిస్థితులను బట్టి కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే రణబీర్, అలియా పెళ్ళి జరగనుందని తెలుస్తోంది.