ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప : ది రైజ్” బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయన గత చిత్రం “అల వైకుంఠపురములో” హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా థియేటర్లలో విడుదల అవుతుందని ప్రకటించారు. హిందీ డబ్బింగ్ వెర్షన్ హక్కులను మనీష్ సొంతం చేసుకున్నాడు. కానీ అప్పటికే “అల వైకుంఠపురములో” హిందీ రీమేక్ వెర్షన్ తెరకెక్కుతుండడంతో వివాదం మొదలైంది. దీంతో హిందీ వెర్షన్ థియేట్రికల్ విడుదలను రద్దు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. “షెహజాదా” అనే టైటిల్ తో హిందీ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీక్ ను హీరోగా తీసుకున్నారు మేకర్స్. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రిలీజ్ వార్తలు హిందీ రీమేక్ మూవీ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుందని ‘షెహజాదా’ మేకర్స్ ఆందోళన చెందారు. హిందీ రీమేక్ తొలి షెడ్యూల్‌ను ఢిల్లీలో చిత్రీకరించారు. ఈ సినిమా నుంచి కార్తీక్ తప్పుకోవడంపై నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం వెనుక కార్తిక్ ఆర్యన్ హస్తం ఉన్నట్లు చిత్ర నిర్మాత తెలిపారు.
Read Also : ‘కేజీఎఫ్-2’ టార్గెట్ అవుతోందా ? భారీ క్లాష్ తో రణరంగమే !
“అల వైకుంఠపురములో” నిర్మాత అయిన మనీష్ షా ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ థియేట్రికల్ రిలీజ్‌ని క్యాన్సిల్ చేయడం గురించి ఓపెన్ అయ్యారు. డబ్బింగ్ హిందీ వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేస్తే ‘షెహజాదా’ నుండి తప్పుకుంటానని కార్తీక్ బెదిరించినట్లు తెలుస్తోంది. దీని వల్ల ‘షెహజాదా’ నిర్మాతలకు 40 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని మనీష్ అభిప్రాయపడ్డారు. మనీష్ ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అన్‌ప్రొఫెషనల్ అంటూ కార్తీక్ పై మండిపడ్డాడు. ఇంకా హిందీ-డబ్బింగ్ వెర్షన్ థియేట్రికల్ విడుదలను ఎందుకు ఆపివేశారనే దాని గురించి నిర్మాత మాట్లాడుతూ ““షెహజాదా నిర్మాతలు నాకు పదేళ్లుగా తెలుసు. నా దగ్గరి వ్యక్తులు 40 కోట్లు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను సినిమా హిందీ డబ్బింగ్ థియేట్రికల్ రిలీజ్ ను వదులుకున్నాను. ఈ చర్య వల్ల “అల వైకుంఠపురములో” నిర్మాతకు 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అన్నాడు. కేవలం డబ్బింగ్‌కే 2 కోట్లు ఖర్చు చేశాను. ఈ చిత్రం ‘పుష్ప : ది రైజ్’ కంటే పెద్దదిగా ఉండాలని నేను కోరుకున్నాను. నేను సినిమాను విడుదల చేయకపోతే నాకు నష్టం తప్పదు. అందుకే ఇప్పుడు నా ఛానెల్‌లో విడుదల చేస్తున్నాను. ఇదంతా నేను అల్లు అరవింద్ వల్ల మాత్రమే చేశాను… కార్తీక్ ఆర్యన్ కోసం కాదు. అతనెవరో నాకు తెలియదు” అంటూ చెప్పుకొచ్చాడు.