ANR Vardanti: ఉత్తరాదిన ‘ట్రాజెడీ కింగ్’ అనగానే మహానటుడు దిలీప్ కుమార్ ను గుర్తు చేసుకుంటారు. దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఆ ‘ట్రాజెడీ కింగ్’ అన్న మాటకు ప్రాణం పోశారు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. భగ్నప్రేమికులను చూడగానే పాత కథలు గుర్తు చేసుకుంటూ ఉంటారు జనం. అలా విఫలమై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రేమకథల్లో మనకు ముందుగా ‘రోమియో-జూలియట్’,’లైలా-మజ్ను’ వంటివి కనిపిస్తాయి. తరువాత మన దేశం విషయానికి వస్తే ‘సలీమ్- అనార్కలి’, ‘దేవదాసు’ కథలూ స్ఫురిస్తాయి. ఎవరైనా ప్రేమవిఫలమై తాగుబోతయితే వారిని చూసి ‘దేవదాసు’ అయ్యాడని అనడం మన దేశంలో సర్వసాధారణమై పోయింది. విశేషమేమిటంటే, ఈ ప్రఖ్యాతి గాంచిన ప్రేమకథల్లో మూడింట ఏయన్నార్ నటించడం! అందువల్లే కాబోలు తెలుగువారు ఆయనను ‘ట్రాజెడీ కింగ్’ అని కీర్తించారేమో అనిపిస్తుంది.
నిజానికి ఏయన్నార్ ను ‘దేవదాసు’లో నటించాకే విషాద ప్రేమికునిగా జీవించారని అందరూ అంటూ ఉంటారు. అయితే ఆ సినిమాకు నాలుగేళ్ళు ముందుగానే 1949లో ‘లైలా-మజ్ను’లో భగ్నప్రేమికుడు మజ్నుగా అక్కినేని అభినయించి అలరించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించి, నటునిగా ఏయన్నార్ కు మంచి మార్కులే సంపాదించి పెట్టింది. అయితే ఆ తరువాత ఆయన నటించిన జానపద చిత్రాలు మళ్ళీ ఏయన్నార్ ను సక్సెస్ రూటులో సాగేలా చేశాయి. అయితే యన్టీఆర్ ఆగమనంతో ఏయన్నార్ తన పంథా మార్చాలని భావించారు. అందువల్లే యన్టీఆర్ తో కలసి తాను నటించిన ‘పల్లెటూరి పిల్ల’ జానపద చిత్రంలో త్యాగం మూర్తీభవించే పాత్రలోనే నటించారు ఏయన్నార్. అందులో నాయిక అంజలీదేవిని ఏయన్నార్ ప్రేమిస్తారు. కానీ, ఆమె యన్టీఆర్ ను ప్రేమించడంతో భగ్నప్రేమికుడైపోతాడు. తరువాత మనసు మార్చుకొని, వారిద్దరూ బాగుండాలనే తపిస్తాడు. చివరలో నాయిక కొడుకును కాపాడటానికి పోరాటం చేసి ప్రాణత్యాగం కూడా చేయడంతో నటునిగా మంచి పేరు సంపాదించారు అక్కినేని. అయితే ఆ పై ఏయన్నార్ నటించిన చిత్రాలలో బరువైన పాత్రలేవీ లభించలేదు. ఈ నేపథ్యంలోనే వినోదా సంస్థ ఏయన్నార్ ను ‘దేవదాసు’ పాత్ర కోసం ఎంపిక చేసినప్పుడు కొన్ని విమర్శలు వినిపించాయి. వాటిని సవాలుగా తీసుకొని ‘దేవదాసు’ పాత్రను పోషించారు ఏయన్నార్. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ పాత్రలో జీవించారు అక్కినేని. అందువల్లే ‘దేవదాసు’ తరువాతే ఏయన్నార్ ట్రాజెడీ బాగా పోషించగలరు అనే పేరు సంపాదించినట్టు సినీజనం అంటూ ఉంటారు.
‘దేవదాసు’ పాత్రతో ఏయన్నార్ నటునిగా పలు మెట్లు పైకి ఎక్కారు. ఆ తరువాత ఆ ముద్రనుండి బయట పడటానికి విభిన్నమైన పాత్రలు పోషించారు. అయితే ‘అనార్కలి’లో మళ్ళీ భగ్నప్రేమికునిగా సలీమ్ పాత్రలో నటించారు ఏయన్నార్. ఈ రెండు చిత్రాల తరువాత ఏయన్నార్ ను అందరూ ‘ట్రాజెడీ కింగ్’ అనడం ఆరంభించారు. ఆ పై ఆయన కూడా ఆ తరహా పాత్రలు వస్తే కాదనకుండా నటించారు. దాంతో ‘ట్రాజెడీ కింగ్’ అన్న పేరు మరింత బలపడింది. “పెళ్ళికానుక, వెలుగునీడలు, బాటసారి, పూజాఫలం, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి, మనసే మందిరం, మహాత్ముడు, దేవదాసు మళ్ళీ పుట్టాడు” వంటి చిత్రాలలో ఏయన్నార్ భగ్నప్రేమికునిగానే కనిపించారు. ఇక ‘ప్రేమనగర్’లో కథ సుఖాంతమవుతుంది. కానీ, అందులోనూ ప్రియురాలు దూరం కావడంతో విషం తాగి చనిపోవాలనే పాత్రలో ఏయన్నార్ తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నారు.
అంతకు ముందు ట్రాజెడీ రోల్స్ లో ఏయన్నార్ నటించడం ఒక ఎత్తు, ఆయనతో దాసరి నారాయణరావు రూపొందించిన ‘ప్రేమాభిషేకం’లో అభినయించడం మరో ఎత్తు అనే చెప్పాలి. కమర్షియల్ వీల్ లో తెలుగు సినిమా గిర్రున తిరుగుతూ పోతున్న రోజుల్లో యన్టీఆర్, ఏయన్నార్ ఇంకా పడచు పిల్లలతో స్టెప్స్ వేస్తూ నటించడంపై పలు విమర్శలు వినిపించాయి. ఆ నేపథ్యంలో దాసరి నారాయణరావు వారిద్దరి ఇమేజ్ కు తగ్గ కథలతో చిత్రాలు రూపొందించారు. యన్టీఆర్ తో ‘సర్దార్ పాపారాయుడు’ వంటి సినిమాను తెరకెక్కించిన దాసరి, ఆ తరువాత ఏయన్నార్ కు ఉన్న ‘ట్రాజెడీ కింగ్’ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ‘ప్రేమాభిషేకం’ తెరకెక్కించారు. ఏయన్నార్ పెళ్ళి రోజయిన ఫిబ్రవరి 18వ తేదీన 1981లో విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఇందులో ప్రేమించిన ప్రేయసి కోసం పలు పాట్లు పడి, చివరకు ఆమె ప్రేమను దక్కించుకున్న తరువాత హీరో తనకు కేన్సర్ వ్యాధి ఉందని తెలుసుకుంటాడు. దాంతో ఆమె మనసు మారేలా చేసి, ఆమెను ఎంతగానో ప్రేమించే వ్యక్తితో పెళ్ళి జరిగేలా చేస్తాడు హీరో. చివరకు అతని మంచి తనం తెలిసిన హీరోయిన్, క్షమించమని వేడుకొనేందుకు వచ్చే సరికే హీరో అంతిమగడియల్లో చివరి చూపు చూసి కన్నుమూస్తాడు. నిజం చెప్పాలంటే అంతకు ముందు ఏయన్నార్ పోషించిన విషాదాంత ప్రేమకథలకంటే భిన్నంగా ‘ప్రేమాభిషేకం’ రూపొందింది. తొలుత 30 కేంద్రాలలో శతదినోత్సవం చూసి, ఆ తరువాత మరో 13 కేంద్రాలలోనూ వందరోజులు నడిచిందీ చిత్రం. అప్పట్లో సిల్వర్ జూబ్లీలో రికార్డు సృష్టించింది. గుంటూరు విజయా టాకీసులో ఏకధాటిగా 380 రోజులు ప్రదర్శితమై మొన్నటి దాకా ఓ రికార్డుగా నిలచింది. విషాదాంత ప్రేమ కథలతో రూపొందిన చిత్రాలలో తెలుగునాట ఈ స్థాయి విజయం చూసిన చిత్రం మరొకటి కానరాదు. అందువల్లే ఏయన్నార్ జనం మదిలో ‘ట్రాజెడీ కింగ్’గా నిలచిపోయారు.
‘ప్రేమాభిషేకం’ ఘనవిజయం తరువాత నుంచీ అక్కినేని సినిమాల్లో ఏదో విధంగా ఓ విషాద గీతం చోటు చేసుకొనేలా చేయడం మొదలయింది. అలా “రాగదీపం, బంగారుకానుక, గోపాలకృష్ణుడు, మేఘసందేశం, అమరజీవి” వంటి చిత్రాలు రూపొందాయి. కానీ, ఏవీ ‘ప్రేమాభిషేకం’ స్థాయిలో అలరించలేకపోయాయి. ఏది ఏమైనా తెలుగునాట ‘ట్రాజెడీ కింగ్’ అనగానే అక్కినేని నాగేశ్వరరావే గుర్తుకు వచ్చేలా ఆయన అభినయ వైభవం సాగింది.
(జనవరి 22న ఏఎన్ఆర్ వర్ధంతి)