తెలుగు చిత్రసీమలో విషాదాంత ప్రేమకథా చిత్రాలలోనూ నటించి, ఘనవిజయాలు సాధించిన ఘనత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు సొంతం! విషాదాంత ప్రేమకథలు అనగానే “లైలా-మజ్ను, అనార్కలి- సలీమ్, పార్వతి-దేవదాసు” గుర్తుకు వస్తారు. చిత్రమేమిటంటే, ఈ మూడు కథల్లోని ప్రేమికుని పాత్రల్లో నటించి జనాన్నిమెప్పించారు ఏయన్నార్. అందుకే జనం మదిలో ‘ట్రాజెడీ కింగ్’గా నిలిచారు అక్కినేని. ఆ తరువాత కూడా ట్రాజెడీ రోల్స్ లో నటసమ్రాట్ తనదైన బాణీ పలికించారు.
‘లైలా-మజ్ను’లో “పయనమయే ప్రియతమ… నను మరచిపోకుమా…” పాటలో భగ్నప్రేమికునిగా ఏయన్నార్ అభినయం అలరించింది. అయితే ఆయనను ‘ట్రాజెడీ కింగ్’గా నిలిపిన సినిమా ‘దేవదాసు’ అనే చెప్పాలి. ‘లైలా మజ్ను’ విడుదలైన నాలుగేళ్ళకు ‘దేవదాసు’ వెలుగు చూసింది. అప్పటికే అశేష పాఠకలోకాన్ని అలరించిన ‘దేవదాసు’ నవల చదివిన వారు, ఆ కథతో రూపొందిన హిందీ, బెంగాలీ చిత్రాలు చూసినవారు ‘దేవదాసు’గా అక్కినేని ఆకట్టుకోలేరని అన్నారు. కొందరు ఆ చిత్ర రూపశిల్పులు – వినోదా అధినేతలైన వేదాంతం, డి.యల్, సముద్రాలను ముఖానే విమర్శించారు. దాంతో ‘దేవదాసు’ పాత్రను పండించాలని ఏయన్నార్ లో కసిపెరిగింది. ఆ సినిమాను తన నటజీవితానికే సవాల్ భావించారు. విమర్శకుల నోళ్ళు మూయిస్తూ ‘దేవదాసు’ పాత్రలో జీవించారు అక్కినేని. ఇందులో “జగమే మాయ…”, “కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్…”, “చెలియలేదు… చెలిమి లేదు…” వంటి పాటల్లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఏయన్నార్ అభినయించిన తీరు ప్రేక్షకుల కళ్ళలో గంగను పొంగించింది. ‘దేవదాసు’ సినిమా ఏయన్నార్ ను మహానటునిగా నిలపడమే కాదు, బాక్సాఫీస్ వద్ద జయకేతనమూ ఎగరవేసింది.
మరో విషాదాంత ప్రేమకథ ‘అనార్కలి’లో సలీమ్ గానూ ఏయన్నార్ ఒప్పించారు. అప్పటికే హిందీలో తెరకెక్కిన ‘అనార్కలి’ చిత్రం ఛాయల్లోనే ఈ సినిమా తెరకెక్కింది. తెలుగువారి సలీమ్ గా అక్కినేని జేజేలు అందుకున్నారు. “పెళ్ళికానుక, సుమంగళి” చిత్రాల్లోనూ భగ్నప్రేమికునిగా, త్యాగమూర్తిగా ఏయన్నార్ అభినయించిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు? ‘బాటసారి’లో మౌన ప్రేమికునిగా ఏయన్నార్ తనదైన నటన ప్రదర్శించారు. ‘మూగమనసులు’లోనూ మూగప్రేమను అభినయించి ఆకట్టుకున్నారు. “మనసు మూగదే కానీ, బాసుంటది దానికి…” అంటూ ఆత్రేయ పలికించిన పదాలకు అనువైన అభినయాన్ని తెరపై ఆవిష్కరించారు అక్కినేని.
‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’లో భగ్నప్రేమికునిగా కనిపించినా, ‘రావణుడే రావణుడైతే’లో వలచిన వనితను మరిచే పాత్రలోనూ అక్కినేని అభినయం ఆకట్టుకుంది. చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆయన నటన కోసమే సినిమాలు చూసిన వారున్నారు. ఇక ‘ప్రేమాభిషేకం’లో అక్కినేని అభినయవైభవం ఓ చరిత్రగా నిలచింది. విషాదాంత ప్రేమకథతో ‘ప్రేమాభిషేకం’ స్థాయి విజయాన్ని చవిచూసిన చిత్రం మరొకటి కానరాదు. ఇకపై రాదు అని కూడా చెప్పవచ్చు. అలా విషాదాంత గాథలతో మెప్పించిన ఏయన్నార్ ను అభిమానులు ఈ నాటికీ ‘ట్రాజెడీ కింగ్’ అంటూ కీర్తిస్తూనే ఉన్నారు. భావితరాలు సైతం నటసమ్రాట్ నటనా వైభవాన్ని చూసి జేజేలు పలుక కుండా ఉండలేవు.