తెలుగునాట పుట్టి, తమిళనాట తడాఖా చూపించిన వారెందరో ఉన్నారు. అలా తమిళ చిత్రాల్లో స్టార్ హీరోగా తనదైన బాణీ పలికించిన ఘనుడు అజిత్ కుమార్. తలకు రంగు కూడా వేసుకోకుండా, తాను ఎలా పడితే అలా నటించినా అజిత్ చిత్రాలు తమిళ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ‘తల అజిత్’ గా తమిళనాట తనదైన సక్సెస్ రూటులో సాగిపోతున్నారు అజత్. ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి అనువాదమై అలరిస్తున్నాయి.
అజిత్ 1971 మే 1న సికిందరాబాద్ లో జన్మించారు. కొంతకాలం వైజాగ్ లోనూ ఉన్నారు. చెన్నైలో చదివారు. అయితే అతని అన్న, తమ్ముడు ఇద్దరూ చదువులో ఎంతగానో రాణిస్తే అజిత్ మాత్రం పెద్దగా చదువుకోలేదు. 1990లో సురేశ్ హీరోగా రూపొందిన ‘ఎన్ వీడు ఎన్ కనవర్’ అనే చిత్రంలో అజిత్ ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ తరువాత ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ ‘ప్రేమపుస్తకం’ తెరకెక్కిస్తూ అజిత్ ను హీరోగా ఎంచుకున్నారు. ఆ సినిమాలో అజిత్ పేరును శ్రీకర్ గా మార్చారు. ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే ప్రమాదవశాత్తు శ్రీనివాస్ మరణించారు. తరువాత గొల్లపూడి సినిమాను పూర్తి చేశారు. అందువల్ల ఆ సినిమా షూటింగ్ ఆలస్యమయింది. ఈ లోగా తమిళ దర్శకుడు సెల్వ రూపొందించిన ‘అమరావతి’ చిత్రంలో హీరోగా నటించారు అజిత్. ‘ప్రేమపుస్తకం’ విడుదలైనా తెలుగులో అతనికి అవకాశాలేమీ లభించలేదు. దాంతో తమిళనాటనే తన అదృష్టం పరీక్షించుకున్నారు. అగత్యన్ దర్శకత్వంలో అజిత్ నటించిన ‘కాదల్ కోట్టై’ అనూహ్య విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమలేఖ’ పేరుతో అనువాదమై ఇక్కడా మంచి విజయాన్ని చేజిక్కించుకుంది. ఆ తరువాత ఎస్.జె.సూర్య తెరకెక్కించిన ‘వాలి’ చిత్రంలోనూ అజిత్ అభినయం అందరినీ అలరించింది. ఈ చిత్ర విజయంతో అజిత్ తమిళనాట స్టార్ హీరోగా మారారు.
తమిళనాట అజిత్ కు ఊహించని విధంగా స్టార్ డమ్ లభించింది. అతను నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. అజిత్ స్టైల్ అంటే ఆయన అభిమానులకు విపరీతమైన క్రేజ్. తల మొత్తం నెరసిపోయినా, రంగు కూడా వేసుకోకుండా, కొన్నిసార్లు గడ్డం కూడా గీసుకోకుండా అజిత్ నటించిన తీరు ఆయన ఫ్యాన్స్ ను ఎంతగానో మురిపిస్తూ ఉంటుంది. ‘తల’ అంటూ అజిత్ ను ఫ్యాన్స్ అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారు. ఒకప్పుడు తెలుగు చిత్రాలలో బాలనటిగా మెప్పించిన శాలినిని అజిత్ పెళ్ళాడారు. వారికి ఇద్దరు పిల్లలు. అజిత్ కు రేస్ కార్లన్నా, బైక్స్ అన్నా ఎంతో ఇష్టం. ఫస్ట్ ప్యాండమిక్ లో హైదరాబాద్ షూటింగ్ నిమిత్తం వచ్చి ఇరుక్కుపోయారు. ఆ సమయంలో బైక్ మీదే అజిత్ చెన్నైకి వెళ్ళినట్టు విశేషంగా చెప్పుకున్నారు. ఇక తనతో పనిచేసే వారిని, షూటింగ్ లో కో-వర్కర్స్ ను ఆయన ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. తన ఇంట్లో పనిచేసేవారికి ఇళ్ళు కూడా కట్టించి మంచి మనసు చాటుకున్నారు అజత్. ఈ మధ్యే విడుదలైన అజిత్ ‘వలీమై’ అంతగా అలరించలేకపోయింది. త్వరలోనే మరో మంచి సినిమాతో అజిత్ తమను పలకరిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ సారి అజిత్ ఏ రీతిన అలరిస్తారో చూడాలి.