Adivi Sesh New Movie Major Updates.
అడివి శేష్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 సంఘటనలో అసువులు బాసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. మార్చి 15 మేజర్ సందీప్ 45వ జయంతి సందర్భంగా అతని బాల్య స్మృతులను, శిక్షణా రోజులను, తల్లిదండ్రులతో, సోదరితో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియచేస్తూ ఓ వీడియోను ‘మేజర్’ చిత్ర బృందం రూపొందించి విడుదల చేసింది. సందీప్ జీవితంలోని కీలక సంఘటనలనూ ఈ సినిమాలో చూపించారు. దానికి సంబంధించిన ఫోటోలను జత చేస్తూ ఈ వీడియో సాగింది. దీనిని చూస్తుంటే మేజర్ ఉన్ని కృష్ణన్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి అడివి శేష్ పడిన కష్టం కనిపిస్తుంది.
తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ‘మేజర్’ చిత్రాన్ని మలయాళంలోనూ అనువదించి, మే 27వ తేదీ విడుదల చేయబోతున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశలో ఉంది. దీనికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రముఖ పాత్రలు పోషించిన ఈ సినిమాను మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఎ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోంది.