తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లను అమాంతం పెంచేయడం వల్ల, సాధారణ ఆడియన్స్ థియేటర్లకు రావడం చాలావరకు తగ్గించేశారు. ఈ దెబ్బకు.. కలెక్షన్ల పరంగా చాలా చిత్రాలు ప్రభావితం అయ్యాయి. చాలా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది గమనించిన మన మేకర్స్.. టికెట్ రేట్ల విషయమై తలొగ్గుతున్నారు. ఆల్రెడీ ఎఫ్3 సినిమాకు సాధారణ టికెట్ రేట్లే పెడుతున్నామని నిర్మాత దిల్‌రాజు ప్రకటించేశారు. ఇప్పుడు మేజర్ సినిమాకీ సాధరణ రేట్లకే టికెట్లు అందుబాటులో ఉంటాయని హీరో అడివి శేష్ క్లారిటీ ఇచ్చాడు.
‘మేజర్’ ఒక పాన్ ఇండియా సినిమా. దీనికి ఖర్చు బాగానే పెట్టారు. ఇది 2008లో ముంబై దాడుల్లో మరణించిన మేజర్ ఉన్నికృష్ణన్ నిజ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా కావడం, ప్రోమోలూ ఆసక్తికరంగా ఉండడంతో.. ఈ చిత్రానికి జాతీయంగా మంచి క్రేజ్ వచ్చిపడింది. దీంతో, ఈ సినిమా టికెట్ రేట్లపై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా? అనే విషయంపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అడివి శేష్ నిర్వహించిన ‘ఆస్క్ శెష్’ సెషన్‌లోనూ దాని ప్రస్తావన వచ్చింది. ‘‘టికెట్ రేట్లను తగ్గించండి, రిపీటెడ్‌గా చూడడానికి వీలుంటుంది, ఫలితంగా ఇండస్ట్రీని కాపాడొచ్చు’’ అని ఓ అభిమాని శేష్‌ని సూచించాడు.
ఇందుకు శేష్ బదులిస్తూ.. తమ సినిమా టికెట్లు సాధారణ రేట్లకే అందుబాటులో ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు. ఇది సాధారణ ప్రేక్షకులకు చూడాల్సిన ఓ ఎక్స్‌ట్రార్డినరీ సినిమా అని వెల్లడించాడు. దీంతో, ఎఫ్3 తర్వాత సాధారణ ధరకే టికెట్ రేట్లను కేటాయించిన సినిమాగా మేజర్ నిలిచింది.