ప్రభాస్ చేస్తోన్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటైన ‘ఆదిపురుష్’ చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభంలోనే ముగిసింది. అయినప్పటికీ ఇప్పటివరకూ ఈ సినిమా ప్రోమోని గానీ, కనీసం ఫస్ట్ లుక్‌ని గానీ చిత్రబృందం విడుదల చేయలేదు. శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. దర్శకుడు ఓమ్ రౌత్ ఫ్యాన్ మేడ్ వీడియోతో షాకిచ్చాడు. ప్రస్తుతానికి దీంతోనే సరిపెట్టుకోండని చెప్పి, సైలెంట్ అయిపోయాడు. పోనీ, ఆ తర్వాతైనా ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమోనని అనుకుంటే, ఫ్యాన్స్‌కి నిరీక్షణ తప్పితే మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు.
ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊరట కలిగించే ఓ శుభవార్త తెరమీదకొచ్చింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23వ తేదీన ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేయనున్నారట! అక్టోబర్ నుంచి తాము ప్రచార కార్యక్రమాల్ని మొదలుపెడతామని చిత్రబృందం అఫీషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే ఫస్ట్ లుక్‌ని అక్టోబర్ 23న రిలీజ్ చేయనున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అయినా, ఫస్ట్ లుక్ కోసం అక్టోబర్ వరకూ వేచి చూడక తప్పదు. ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ రాముడిగా నటిస్తోన్న ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.