వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి అదా శర్మ. ఇటీవల చేసిన ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అదా ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ 2023లో విడుదలై దేశవ్యాప్తంగా భారీ చర్చలకు కారణమైంది. ఆ సినిమా ద్వారా అదా శర్మకు విపరీతమైన పేరు, ప్రాచుర్యం వచ్చినప్పటికీ, అదే సమయంలో తీవ్ర విమర్శలు, బెదిరింపులు కూడా ఎదురయ్యాయి.
తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “రిస్క్ ఉన్న పాత్రలు చేసినప్పుడే కెరీర్‌కు విలువ పెరుగుతుంది. నా తొలి సినిమా ‘1920’ నుంచే నేను ధైర్యమైన కథలు ఎంచుకుంటున్నాను. కానీ ‘ది కేరళ స్టోరీ’ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా విడుదలైనప్పుడు దేశంలో సగం మంది నన్ను చంపాలని చూశారు, మిగతా సగం మంది మాత్రం నన్ను రక్షించారు, నాపై ప్రేమ కురిపించారు,” అని అదా వెల్లడించారు.
అదే సమయంలో, తన తర్వాతి చిత్రం ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని తెలిపారు. స్క్రిప్ట్ ఎంపిక గురించి మాట్లాడుతూ అదా అన్నారు .. “నేను ఎప్పుడూ సవాళ్లతో కూడిన పాత్రలు ఎంచుకుంటాను. పాత్రలో భావోద్వేగం లేకపోతే నాకు ఆసక్తి ఉండదు. యాక్షన్ సన్నివేశాలు ఉండాలి. అలాగే, కొన్ని లీటర్ల నీళ్లు తాగి ఏడ్చి నన్ను నేను డీహైడ్రేట్ చేసుకునే అవకాశం ఉండే రోల్స్ అంటే నాకు ఇష్టం. అలాంటి పాత్రలు చేస్తే నా ఫ్యామిలీ కొన్నిసార్లు ఆందోళన చెందుతుంది, కానీ నేను ఆనందిస్తాను,” అని చెప్పుకొచ్చారు. తన స్పష్టమైన మాటలతో, బోల్డ్ నిర్ణయాలతో అదా శర్మ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఆమె పలు బలమైన కాన్సెప్ట్ ప్రాజెక్ట్‌లలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు.