పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది ముంతాజ్. కోలీవుడ్ హీరోయిన్ గా తెలుగులో పలు సినిమాల్లో ఐటెం సాంగ్ చేయి మెప్పించిన ఈ బ్యూటీ అత్తారింటికి దారేది చిత్రంలో ‘ఓరి దేవుడా దేవుడా’ సాంగ్ లో మరోసారి పవన్ సరసన నటించిన తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది. ఇక తాజాగా ఈ హీరోయిన్ పై గృహహింస కేసు నమోదు కావడం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ముంతాజ్ ప్రస్తుతం చెన్నై లోని అన్నగారు లో నివసిస్తోంది. ఆమె ఇంట్లో గత కొన్నేళ్లుగా ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు పనిచేస్తున్నారు. అయితే అందులో ఒక బాలిక ఇటీవలే అన్నానగర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ముంతాజ్ పై ఫిర్యాదు చేసింది. ముంతాజ్ తమను వేధిస్తోందని, తమకు తమ సొంత వూరు వెళ్లిపోవాలని ఉందని చెప్పినా పంపడం లేదని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా తమను రోజూ చిత్ర హింసలు పెడుతున్నట్లు కూడా బాలిక చెప్పడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. సదరు బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముంతాజ్ ఇంటికి వెళ్లి బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఇక ఈ కేసులో ముంతాజ్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఈ విషయమై ముంతాజ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.