టాలీవుడ్ సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం విదితమే. అయితే విద్యాసాగర్ మృతిపట్ల సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న మీనా వాటికి చెక్ పెట్టారు. తన భర్తపై ఎలాంటి అసత్యప్రచారాలు చేయవద్దని మీడియాను వేడుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
“నా భర్త విద్యాసాగర్ మృతిని మేము తట్టుకోలేకుండా ఉన్నాం. ఇలాంటి సమయంలో మాకు, మా కుటుంబానికి కొద్దిగా ప్రైవసీ ఇవ్వండి. మా పరిస్థితిని అర్ధం చేసుకోండి. నా భర్త మృతిపై అసత్య ప్రచారాలు చేయవద్దని మీడియాను వేడుకుంటున్నాను. ఇలాంటి సమయంలో మా కుటుంబానికి సపోర్ట్ గా నిలిచిన వారందరికి ధన్యవాదాలు. నా భర్తను బతికించడానికి పోరాడిన వైద్యులకు, హెల్ప్ చేసిన తమిళనాడు ముఖ్యమంత్రికి, ఆరోగ్యశాఖా మంత్రికి, ఐఏఎస్ రాధాకృష్ణన్, కుటుంబ సభ్యులు, స్నేహితులందరికి ధన్యవాదాలు. ముఖంగా నా భర్త బతకాలని దేవుడ్ని ప్రార్దించిన నా అభిమానులకు, మీడియాకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ పై మీనా అభిమానులు ఆమెకు ధైర్యం చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నాం.. మీకు మేము సపోర్ట్ గా ఉంటాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.